
నెలకు రూ.40 లక్షలు భరణం
● కోర్టులో నటుడు రవిమోహన్ పై భార్య పిటిషన్
తమిళసినిమా: పలు విజయవంతమైన చిత్రాలు చేసి ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న జయంరవి. ఈయన 2009లో ఆర్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాంటిది అనూహ్యంగా వీరి సంసార జీవితంలో ముసలం పుట్టింది. కారణాలేమైనా విడిపోయారు. విడాకుల కోసం కోర్టుకెక్కారు . జయం రవి తన పేరును రవిమోహన్‌గా మార్చుకున్నారు. వీరి వ్యవహారం గత కొంత కాలంగా టీవీ.సీరియల్‌గా సాగుతోంది. భార్య ఆర్తితో తలెత్తిన విభేదాల కారణంగా నటుడు రవిమోహన్ ఇటీవల ఆమె నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్దానం ఇద్దరి మధ్య సామరస్య చర్చలతో పరిష్కారానికి పలు మార్లు అవకాశం కల్పించింది. అయితే చర్చలు సఫలం కాలేదు. తనకు విడాకులు కావాలని నటుడు రవిమోహన్ పట్టుబట్టారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు. తన సంపాదనంతా ఆర్తి తన ఆడంబరాలకే ఖర్చు చేసిందని రవిమోహన్ ఆరోపిస్తే, తమ మధ్య విడాకులకు కారణం గాయని కనిష్కా ఫ్రాన్సిస్ అని, ఆమెతో తన భర్త కలిసి తిరుగుతున్నారని ఆర్తి విమర్శించారు. కాగా బుధవారం నటుడు రవిమోహన్, ఆర్తి విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భరణంగా రవిమోహన్ తనకు నెలకు 40 లక్షలు చెల్లించేవిధంగా ఆదేశించాలని కోరుతూ ఆర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె పిటిషన్‌పై బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి రవిమోహన్‌కు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేశారు.