
మళ్లీ పెరగనున్న వేడి!
● వారం పాటు సాధారణంగానే వానలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వాతావరణంలో మళ్లీ మార్పు చోటు చేసుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం పుణ్యమాని గాలిలో తేమ తగ్గి మళ్లీ భానుడి ప్రతాపం పెరగనుంది. వారం రోజుల పాటు అక్కడక్కడ సాధారణం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతు పవనాలు అండమాన్ తీరాన్ని తాకినానంతరం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో చెదరు మదురుగా, మరికొన్ని జిల్లాలో అనేక చోట్ల భారీ గా వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కోయంబత్తూరు, నీలగిరి, వేలూరు, రాణిపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరుగా వర్షం కురిసింది. రాణిపేట జిల్లా ఆర్కాడులో అత్యధికంగా 14 సెంటీమీటర్ల, అరక్కోణంలో 12 సె.మీ., వేలూరు జిల్లా పరిధిలోని అనైకట్టులో 10 సె.మీ వర్షం పడింది. చైన్నె శివారులో తేలిక పాటి వర్షం కురిసింది. వర్షాలు ఇంకా కొనసాగుతాయని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ముందుగా ప్రకటించింది. అయితే, అరేబియా సముద్రంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఇది వాయుగుండంగా, ఆ తర్వాత తుపాన్‌గా మారే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడి గాలిలో తేమ తగ్గనుంది. ఈ కారణంగా రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే, నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి, ధర్మపురితోపాటుగా పశ్చిమ కనుమల వెంబడి జిల్లాలో మోస్తరుగా వర్షం, ఇతర ప్రాంతాల్లో సాధారణంగా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అరేబియా సముద్రంలో నెలకొనే అల్పపీడనం ప్రయాణించే మార్గం ఆధారంగా పరిస్థితులు మారవచ్చని పేర్కొనడం గమనార్హం.