
విస్తృతంగా తోళి!
● 38.15 కోట్లతో 3 చోట్ల నిర్మాణాలు పూర్తి ● మరో 14 చోట్ల రూ.176 కోట్లతో పనులు ● సీఎం శంకుస్థాపన
వర్కింగ్ ఉమెన్స్ కోసం తోళి (ఫ్రెండ్స్ హాస్టల్ ) హాస్టళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంది. రూ. 38.15 కోట్లతో పరింగిమలై, హోసూరు,
తిరువణ్ణామలైలలో నిర్మాణాలు పూర్తి
చేసుకున్న తోళి హాస్టళ్లను బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. మరో
14 చోట్ల రూ. 176 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం మహిళలకు పెద్దపీట వేస్తూ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, నెలకు రూ. 1000 నగదు పంపిణి నిమిత్తం కలైంజ్ఞర్ మగళీర్ ఉరిమై తిట్టం, విద్యార్ధినులకు నెలకు రూ. 1000 ఉన్నత విద్యా ప్రోత్సాహం వంటి పథకాలు విస్తృతంగా అమల్లో ఉన్నాయి. అదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి చైన్నెతో పాటుగా పలు నగరాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు, యువతులకు భద్రత పరంగా , అన్ని రకాల వసతులతో సురక్షితంగా, తక్కువ అద్దెతో బస కల్పించే విధంగా తోళి (ఫ్రెండ్ హాస్టల్స్) నిర్మాణాలను సాంఘీక సంక్షేమం, మహిళా శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చైన్నె, తిరువళ్లూరు, కోయంబత్తూరు. చెంగల్పట్టు, తిరుచ్చి, తంజావూరు, వేలూరు, సేలం, విల్లుపురం, తిరునెల్వేలి, పెరంబలూరు, పుదుక్కోట్టై, తూత్తుకుడి సహా 13 జిల్లాలలో 14 హాస్టళ్లను నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్న మహిళలు, యువతులకు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు సురక్షితంగా మారాయి. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉండటంతో ఆదరణ పెరిగింది.
మరింతగా నిర్మాణాలు
ఫ్రెండ్స్ హాస్టళ్లకు ఆదరణ క్రమంగా పెరుగుతుండటంతో మహిళకు మరింత సహకారం అందించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వ నేతృత్వంలో మరింతగా నిర్మాణాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అదనంగా చైన్నె – పరింగిమలై, హోసూరు, తిరువణ్ణామలైలో 38 కోట్ల 15 లక్షలతో 442 పడకలతో 3 కొత్త హాస్టళ్లు నిర్మించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వీటిని సచివాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, చైన్నె తరమణి, చేపాక్, మధురై, కోయంబత్తూర్, నాగపట్నం, కృష్ణగిరి, ఈరోడ్, కాంచీపురం, కడలూరు, ధర్మపురి, తేని, శివగంగై, రాణిపేట, కరూర్ లలో రూ. 176.93 కోట్లతో 2 వేల పడకలతో 14 హాస్టళ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఎంట్రీ, 24 గంటల భద్రత, వై–ఫై సౌకర్యం, సీసీటీవీ ద్వారా నిఘా, శుద్ధి చేసిన తాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం, టెలివిజన్, వేడి నీటి సౌకర్యం, వాషింగ్ మెషిన్, ఇసీ్త్ర సౌకర్యం, పార్కింగ్ వంటి సౌకర్యాలు తక్కువ అద్దెకు వర్కింగ్ ఉమెన్స్‌కు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ మహిళా హక్కుల శాఖ మంత్రి గీతా జీవన్, ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీధరన్, అదనపు కార్యదర్శి , తోళి ఎండీ ఎస్.వలర్మతి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆర్థిక హక్కుల కోసం ఢిల్లీ వెళ్తున్నా...
ఢిల్లీలో ఈనెల 24వ తేదీన నీతి ఆయోగ్ భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనాలని ఈసారి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దీనిపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొన్ని ప్రశ్నలు సంధించారు. టాస్మాక్ అక్రమాలలో తన వాళ్లను రక్షించుకునేందుకే ఈసారి ఢిల్లీ పర్యటనకు సీఎం వెళ్తున్నారని ఆరోపించారు. అలాగే ఈ అక్రమాలలో ఆ తమ్ముడు ఎవరో? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా సీఎం స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడుకు న్యాయపరంగా దక్కాల్సిన నిధులు, ఆర్థిక హక్కులను రక్షించుకునేందుకే తాను వెళ్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. శశికళ నుంచి అమిత్ షా వరకు బల్ల కింద కాళ్లు పట్టుకునే అలవాటు ఉన్న ప్రతి పక్ష నేతకు తన ఢిల్లీ పర్యటన మీద ఎందుకు అంత ఈర్ష్య అని ప్రశ్నించారు. పులిలా గర్జించిన పులికేసి , చివరకు ఒక్క దండయాత్రతో పిల్లలా మారి తెల్ల జెండాను పట్టిన పళణి స్వామి తన ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీతో పొత్తే లేదంటూ వీరావేశంతో వ్యాఖ్యలు చేసి , చివరకు తమరు ఏం చేశారో అందరికి తెలుసు అని చురకలంటించారు.
కారుణ్య నియామకాలు
అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాలకు చెందిన వారసులు 115 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ అసిస్టెంట్, పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ వంటి పోస్టులు ఇందులో ఉన్నారు. మరణించిన పోలీసు అధికారుల వారసులు 1,132 మంది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి 41 పోలీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్, 444 మంది అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లు, 16,199 మంది గ్రేడ్ 2 కానిస్టేబుళ్లు, 472 మంది అసిస్టెంట్లు, 215 మంది జూనియర్ అసిస్టెంట్లు, 42 టైపిస్టుల పోస్టులు, 42 షార్ట్ హ్యాండ్ టైపిస్టుల పోస్టులు అంటూ మొత్తంగా 17,436 మందికి నియామక ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసినట్టు ఈసందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురుగానందం, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్, డీజీపీ శంకర్ జివాల్, పోలీస్ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ వినీత్ దేవ్ వాంఖడే, పోలీసు సూపరింటెండెంట్ (సంక్షేమం) సత్యప్రియ పాల్గొన్నారు.

విస్తృతంగా తోళి!