
పశ్చాత్తాపంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మాహుతి
సాక్షి, చైన్నె: మద్యం మత్తుతో తాను చేసిన ప్రమాదానికి పశ్చాత్తాపంతో చైన్నె తరమణిలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మాహతి చేసుకున్నాడు. వివరాలు.. తరమణి స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా సెంథిల్ పనిచేస్తున్నాడు. మంగళవారం గిండిసమీపంలోని మడువంకరై వంతెనపై కారు – మోటారు సైకిల్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సెంథిల్ కారణంగా విచారణలో తేలింది. మద్యం మత్తుతో అతి వేగంగా కారును నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో పెరుంగుడికి చెందిన మురుగన్ గాయపడ్డట్టు వెలుగు చూసింది. మత్తులో ఉన్న సెంథిల్‌ను ఆ పరిసర వాసులు చితక్కొట్టిన వీడియో సైతం వైరల్‌గా మారింది. తన మీద కేసు నమోదు కావడంతో తీవ్ర ఆందోళనకు సెంథిల్ గురయ్యాడు. అలాగే, మద్యం మత్తుతో తానుచేసిన ప్రమాదానికి పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ బుధవారం ఉదయం తరమణి ఎంఆర్‌టీఎస్ రైల్వే స్టేషన్ వంతెన కింద ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. వంతెన కింద ఎవరో తగల బడుతున్నట్టు గుర్తించిన స్థానికలు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సెంథిల్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న తరమణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న కారు
● ముగ్గురి దుర్మరణం
సాక్షి, చైన్నె: అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు మరణించారు. కన్యాకుమారి సమీంలోని సూరంకొడి గ్రామానికి చెందిన బాల ప్రభు, తన భార్య, రెండేళ్ల కుమార్తె, మామ కరుప్పు స్వామితో కారులో చైన్నెకు బయలు దేరారు. మార్గంమధ్యలో పాడలూరు వద్ద బుధవారం ఉదయం కారు అతి వేగం కారణంగా అదుపు తప్పింది. రోడ్డు పక్కగా ఉన్న చెట్టును ఢీ కొట్టి ఫల్టీలు కొట్టింది. ఈప్రమాదంతో అటు వైపుగా వెళుతున్న వాహనదారులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో బాల ప్రభు, కరుప్పుస్వామి, రెండేళ్ల కుమార్తె మరణించారు. బాల ప్రభు సతీమణి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్నారు.
మాజీ మంత్రి బంధువు మృతి
అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ బంధువు అరుణ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేరళలోని మూనారు పర్యటనకు వెళ్లి శివకాశికి తిరుగు ప్రయాణంలో ఉన్న ఆయన కారు మార్గంమధ్యలోని బోడి సమీపంలో అదుపు తప్పింది. ఘటనా స్థలంలోనే అ రు ణ్ మరణించారు. అరుణ్ మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ మేన కోడలి భర్త కావడంతో ఆయ న కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
త్యాగ భూమిలో
కాంగ్రెస్ నేతల నివాళి
సాక్షి, చైన్నె: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక ప్రదేశంగా శ్రీపెరంబదూరులోని త్యాగ భూమిలో కాంగ్రెస్ నేతలు బుధవారం ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధి 34వ వర్ధంతి సందర్భంగా అక్కడున్న ఆయన విగ్రహానికి, చిత్ర పటానికి నేతలు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుతొంగై నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ వర్గాలు తరలి వచ్చినివాళులర్పించారు. అనంతరం ఉగ్ర వాదాన్ని తరిమి కొట్టడం లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలోనూ రాజీవ్ చిత్ర పటానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దామని, అమర వీరుల కలలను సాకారం చేద్దామని వ్యాఖ్యలు చేశారు.
కౌన్సిలర్ శారద డీఎంకే నుంచి బహిష్కరణ
స్టాలిన్ ఆదేశాలు
కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్ 65వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు శారద. ఆమె కొళత్తూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చైన్నె తూర్పు జిల్లా డీఎంకే సభ్యులు. ఆమైపె పార్టీ నాయకత్వానికి వివిధ ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల అసంతృప్తికి కారణమైన ఈమెకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆమె ధోరణిలో మార్పు లేదు. దీంతో ఆమైపె చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ఆదేశించారు. శారదను పార్టీ నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించి డీఎంకే జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ఓ ప్రకటనను బుధవారం విడుదల చేశారు. శారద పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని, పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నందున ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవుల నుంచి ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పశ్చాత్తాపంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మాహుతి