
వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్ గాంధీ వర్ధంతి
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు, వేసి నివాళులర్పించారు. అలాగే వేలూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాహీద్‌బాషా అధ్యక్షతన రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాహీద్‌బాషా మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. నిరుపేద ప్రజలకు అవసరమైన పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. దేశంలో తీవ్ర వాద శక్తులు లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీకా రామన్, జిల్లా మాజీ అధ్యక్షుడు కదిర్‌వేలన్, మాజీ కౌన్సిలర్ కోదండపాణి, మూడో డివిజన్ అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణన్, జానకీరామన్, జీకే మోహన్, కప్పల్‌మణి, కోణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వేలూరు, తిరుపత్తూరు,రాణిపేట,తిరువణ్ణామలై జిల్లాల్లో తీవ్ర వాదానికి వ్యతిరేకంగా అధికారులు ప్రతిజ్ఞ చేశారు.