
ఆధునిక పరిశోధనలపై ఆసక్తి చూపాలి
● ఆర్‌ఎంకే చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం
తిరువళ్లూరు: సాంకేతిక రంగం వేగంగా వృద్ధి చెందుతున్న క్రమంలో ఆధునిక పరిశోధనలపై యువత ఽఅధిక ఆసక్తి ప్రదర్శించాలని ఆర్‌ఎంకే విద్యాసంస్థల చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ గ్లోబల్ సైన్స్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఆర్‌ఎంకే మెట్–25 పేరిట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, టెలీ కమ్యూనికేషన్స్‌పై అంతర్జాతీయ సెమినార్‌ను నిర్వహించారు. ఈ సెమినార్‌ను ఆర్‌ఎంకే విద్యాసంస్థల చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం ప్రారంభించారు. ప్రిన్సిపల్ మహ్మద్ జునైద్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు, యువత నూతన పరిశోధనలపై ఆసక్తి పెంచుకుని, ప్రపంచ దేశాలకు పోటీగా కొత్త ప్రాజెక్టులను రూపొందించాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నాణ్యమైన ఇంజినీరింగ్‌కు కొరత లేదన్నారు. పరిశోధనలో భారత్ త్వరలోనే ప్రపంచ స్థాయికి చేరుతుందన్నారు. సెమినార్‌కు అమెరికా, థాయ్‌లాండ్, మలేషియా, దక్షణ కొరియా తదితర దేశాలకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థులు హాజరై తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. ఐదువేల పరిశోధన పత్రాలు సమర్పించగా వాటిలో 201 ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. సెమినార్‌లో ఐసీటీ ఎక్స్‌ప్రెస్ కంప్యూటర్ విజన్ లేబోరేటరి హెడ్ మోమెనియర్ వియుప్లియూనా, యూనివర్సిటీ కంప్యూటర్ లేబోరేటరి హెడ్ పీటర్ బీర్, నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టాంగ్ సివ్‌హాన్, మలేషియా మిలా యూనివర్సిటీ వీసీ గ్రాహం కెండాల్ తదితరులు హాజరై ఇంజినీరింగ్ విభాగంలో కొత్త ఆవిష్కరణల అవసరాన్ని వివరించారు. దీంతోపాటు విద్యార్థులకు పరిశోధన రంగంపై అవగాహన కల్పించేలా ప్రత్యేకంగా సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్ ఆర్‌ఎం కిషోర్, కార్యదర్శి యలమంచి ప్రదీప్, సలహాదారుడు ఎంఎస్ పళణిస్వామి, పిచ్చాండి, మనోహరన్, ఎల్వీన్ చంద్రమేనీ, శివజ్ఞానప్రభు, మణివన్నన్ పాల్గొన్నారు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ విభాగఽధిపతి సేతుకరసి వందన సమర్పణ చేశారు.