
విద్యుత్‌కోతకు నిరసనగా రాస్తారోకో
పళ్లిపట్టు: పళ్లిపట్టులో గాలీవానకు విద్యుత్ సేవలకు అంతరాయం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సమస్యలు పరిష్కరించి విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. అయితే పళ్లిపట్టు టౌన్ పంచాయతీలోని ఆంజనేయనగర్, నగరి రోడ్డు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల పాటు విద్యుత్‌సేవలు స్తంభించడంతో తాగునీటికి సైతం మహిళలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన మహిళలు సహా 50 మంది బుధవారం రాత్రి 9 గంటలకు నగరి రోడ్డు మార్గంలో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వాహన సేవలు స్తంభించడంతో పోలీసులతో పాటూ విద్యుత్ శాఖ సిబ్బంది రాస్తారోకో చేపట్టిన వారితో చర్చలు జరిపారు. గంటలో విద్యుత్ సేవలు పునరద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో చేపట్టారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది శ్రమించి రాత్రి పది గంటలకు విద్యుత్ సేవలు కల్పించారు.