
అలరించిన నృత్య ప్రదర్శన
కొరుక్కుపేట: చైన్నెలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేదికగా గురువు, నాట్యాచార్య అర్చన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. తనదైన నృత్య అభినయంతో, హావభావాలతో ప్రేక్షకులను మైమరిపించారు. శ్రీమాత ట్రస్ట్ –కోయంబత్తూరు నాట్యాచార్య అర్చన చైన్నె టి.నగర్ లోని వెంకట నారాయణ రోడ్డులో ఉన్న టీటీడీ ఆలయం శ్రవణం హాలులో నాట్య సేవ పేరిట నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాట్యాచార్య అర్చన కృష్ణ అష్టకం, కృష్ణ అష్టోత్తరంలకు నృత్యం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలాగే అన్నమాచార్య, త్యాగరాజ, తులసీదాస్, రామదాసు, వల్లభాచార్య, నామ్‌దేవ్ , భక్త మీరా వంటి వారు అందించిన కీర్తనలకు, పాటలకు నృత్య సేవలను అందించి భక్తిభావాన్ని చాటారు. నాట్యాచార్య అర్చనతో పాటూ వారి శిష్యులు దీప్తి, అతిథులు కూడా నృత్యంతో ఆకట్టుకున్నారు. దాదాపు గంటన్నర పాటూ సాగిన నృత్య ప్రదర్శన భక్తులను, సంగీత నృత్య ప్రియులను కనువిందు చేసింది. నాట్యాచార్య అర్చన మాట్లాడుతూ ఏటా చైన్నె టీటీడీ ఆలయంలో పాటూ తిరుమల, గురువాయూర్,ఉడిపి, మూకాంబిక, అన్ని కుంభమేళాలు, ప్రయాగ్ రాజ్, హరిద్వార్, చిదంబరం, తంజావూరు, అనేక ఇతర ప్రదేశాలలో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్టు వెల్లడించారు. చైన్నె టీటీడీ ఆలయంలో నృత్య ప్రదర్శన చేసే అవకాశాన్ని కల్పించిన టీటీడీ–చైన్నె ఏఈవో పార్థసారథి, ధర్మ ప్రచార పరిషత్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.