
సూర్య హీరోగా మరో చిత్రం
కార్తీక్‌సుబ్బరాజ్, సూర్య
తమిళసినిమా: నటుడు సూర్య హీరోగా మరో చిత్రం చేస్తానని, అయితే అది అత్యంత భారీ బడ్జెట్ కథా చిత్రంగా ఉంటుందని, అది తన డ్రీమ్ ప్రాజెక్టు అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. వీరి కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన చిత్రం రెట్రో. నటి పూజాహెగ్డె నాయకిగా నటించారు. నటుడు సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టెయిన్‌మెట్ సంస్థ, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మించాయి. సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మేడే రోజున విడుదలయ్యి టాక్‌కు అతీతంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ముఖ్యంగా నటుడు సూర్య నటనకు, గెటప్‌లకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. దీంతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఒక భేటీలో పేర్కొంటూ సూర్య హీరోగా మరో చిత్రం కచ్చితంగా చేస్తానని చెప్పారు. అయితే అది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఉంటుందని అన్నారు. దీంతో అందులో నటించడానికి సూర్య ఎక్కువ కాల్‌షీట్స్ కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే సూర్య ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నారని, అందువల్ల ఈయనతో తెరకెక్కించే భారీ బడ్జెట్ కథా చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ప్రస్తుతం చెప్పలేనని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పారు. ఇది నిజంగా సూర్య అభిమానులకు సంతోషపడే వార్తే అవుతుంది. కాగా నటుడు సూర్య ప్రస్తుతం ఆయన 45వ చిత్రాన్ని ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్నారు. డ్రీమ్ వారయర్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. దీని తరువాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో నటిస్తారని సమాచారం.

సూర్య హీరోగా మరో చిత్రం