
కాలేజ్ స్టూడెంట్‌గా శింబు
తమిళసినిమా: సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. ఈయన్ని అభిమానులు తెరపై చూసి రెండేళ్లకు పైనే అయ్యింది. దీంతో శింబు నటించిన చిత్రం కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం కమలహాసన్‌తో కలిసి శింబు నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5వ తేదీన ముందుకు రానుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నటుడు శింబు తన 49వ చిత్రానికి రెడీ అయ్యారు. ఇందులో ఆయనకు జంటగా డ్రాగన్ చిత్రం ఫేమ్ కయాడు లోహార్ నటిస్తున్నారు. నటుడు సంతానం ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో నటుడు ఈటీవీ గణేష్ తదితర ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శనివారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో వింటేజ్ శింబును చూస్తారని దర్శకుడు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత శింబు ఇందులో కళాశాల విద్యార్థిగా నటిస్తున్నారని, ఇది కళాశాల నేపథ్యంలో జాలీగా సాగే కమర్షియల్ అంశాలతో కూడిన కథాచిత్రంగా ఉంటుందని చెప్పారు. దీనికి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం, సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.