
నెహ్రూ చిత్ర పటం వద్ద నివాళి అర్పిస్తున్న గవర్నర్, మంత్రులు
● గవర్నర్ పుష్పాంజలి
సాక్షి, చైన్నె: మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని వాడవాడల్లో మంగళవారం ఘనంగా కాంగ్రెస్ వర్గాలు జరుపుకున్నాయి. చైన్నె గిండిలోని నెహ్రూ విగ్రహానికి రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్‌రవి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. వివరాలు.. భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నెహ్రూ 135వ జయంతిని వాడవాడల్లో కాంగ్రెస్ వర్గాలు ఘనంగా జరుపుకున్నాయి. ఆయన విగ్రహాలకు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ నెహ్రూను స్మరిస్తూ బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇక గిండి కత్తిపార వంతెన వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఉదయాన్నే గవర్నర్ ఆర్‌ఎన్‌రవి, మంత్రులు పీకే శేఖర్‌బాబు, అన్భరసన్, స్వామినాథన్, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ తదితరులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరితో పాటు ఆ పార్టీ వర్గాలు నివాళులర్పించాయి. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లోనూ వేడుకలు జరిగాయి. వివిధ పార్టీల నేతల నెహ్రూకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సీఎం స్టాలిన్ ట్వీట్ చేస్తూ, జవహరలాల్ నెహ్రు సేవలను గుర్తు చేశారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు అని, వారిని చక్కగా పెంచే విధానమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.