
నటరాజ విగ్రహం స్వాధీనం
అన్నానగర్: చైన్నె సులైలోని ఓ చెత్తకుండీలో పడి ఉన్న నటరాజ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. చైన్నెలోని సులై జనరల్ కాలిస్ రోడ్‌లోని ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని చెత్త కుండీలో పారిశుధ్య కార్మికులు పరమేశ్వరి, గౌరీ మంగళవారం చెత్త తలగిస్తుండగా ఓ విగ్రహం కనిపించింది. దీంతో వారు విగ్రహాన్ని వేప్పరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. విచారణలో 3 అడుగుల నట రాజ విగ్రహాన్ని దుండగులు ఏదో ఆలయంలో చోరీ చేసి.. తీసుకెళ్లలేక చెత్తకుండీలు పడేసినట్లు భావించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కళా నైపుణ్యాలు
సాక్షి, చైన్నె: సమకాలీన డిజైన్లు, ఆర్ట్ ప్రపంచం, మోడర్నిజం, సృజనాత్మక, కళాకారుల కళా నైపుణ్యాల ఆవిష్కరణలతో స్టూడియో నియోన్ అటిక్ నేతృత్వంలో మంగళవారం చైన్నె రాయపేటలో మేడ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ పేరిట కళాఖండాలు కొలువుదీరాయి. భారతీయ హస్తకళలలో నైపుణ్యాలను చాటే రీతిలో కొలువుదీరిన ఇక్కడి కళాఖండాలను నిర్వాహకులు రంభసేథ్, ప్రియా గణేషన్ వివరించారు.
40 సవర్ల నగలు చోరీ
అన్నానగర్: సమయపురం సమీపంలో మంగళవారం రిటైర్డ్ గ్రామ పాలనాధికారి ఇంట్లో 40 సవర్ల నగలు, నగదు అపహరించిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు..తిరుచ్చి జిల్లా సమయపురం సమీపం అఖిలాండపురం వల్లలార్ నగర్ రెంగా గార్డెన్‌కు చెందిన కుమార్ (68) రిటైర్డ్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇతని భార్య సరస్వతి. వీరికి కుమారులు అరుణ్, ప్రభు ఉన్నారు. అరుణ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభు తిరుచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్టాటిస్టిక్స్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. ఇతను వివాహం చేసుకుని కుటుంబంతో కలిసి తిరుచ్చిలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కుమార్, అతని భార్య సరస్వతి చైన్నెలోని బంధువుల వద్దకు వెళ్లారు. మంగళవారం ఉదయం చైన్నె నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు ఇంటి తలుపు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూశారు. బీరువా పగులగొట్టి 40 సవర్ల నగలు, రూ.35 వేల నగదు దుండగులు చోరీ చేసినట్లు గుర్తించి తిరుచ్చి జిల్లా పోలీస్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
తిరువొత్తియూరు: చైన్నె నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. చైన్నె స్వదేశీ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 6 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 164 మంది ప్రయాణికులు తెల్లవారుజామున 5 గంటలకు భద్రత తనిఖీలు పూర్తి చేసుకుని విమానంలో ఎక్కేందుకు ఉన్నారు. అయితే సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలట్ కంట్రోలింగ్ రూంకు సమాచారం అందించాడు. ఆలస్యంగా బయలుదేరుతుందని ప్రకటించారు. ప్రయాణికులను విమానాశ్రయ విశ్రాంతి గదిలో ఉంచారు. సాంకేతిక లోపం సరిచేసిన తర్వాత విమానం బయలుదేరి వెళ్లింది.
ఐటీఐ విద్యార్థి దారుణ హత్య
తిరువొత్తియూరు: తిరుచ్చిలో ఐటీఐ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీరంగం కొడియలం మేల్‌వీధికి చెందిన పొన్నన్ కుమారుడు గోకుల్ (19) తిరుచ్చి తిరువేరంబుర్లులోని ప్రభుత్వ ఐటీఐలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి గోకుల్ అతని సహోదరుడు, కుటుంబ సభ్యులు నిద్రపోయారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యుత్తు కట్ అయ్యింది. దీంతో గాలి కోసం తలుపులు తెరిచి నిద్రించారు. ఇంటి లోపలికి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు గోకుల్ గొంతు కోసి హత్య చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
వైభవం.. గుణశీలం
పెరుమాళ్ రథోత్సవం
తిరువొత్తియూరు: తిరుచ్చి సమీపంలోని గుణశీలంలో ఉన్న శ్రీవెంకటాచాలపతి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రథోత్సవం కోలాహలంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్‌ను అదిష్టింపజేశారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తుల గోవింద నామస్మరణ నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరించారు.

స్వాధీనం చేసుకున్న నటరాజ విగ్రహం