సాక్షి, చైన్నె: మరో మూడు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కిందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో చైన్నె – తిరునల్వేలి(నెల్‌లై), చైన్నె – విజయవాడ, తిరువనంతపురం – కాసర్‌గాడ్ రైళ్లు ఉన్నాయి. వివరాలు.. ఇప్పటికే చైన్నె నుంచి మైసూరు, కోయంబత్తూరుకు రెండు వందే భారత్ రైళ్లు సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈరైళ్లకు అనూహ్య స్పందన రావడంతో మరికొన్ని మార్గాల్లో ఈ రైళ్ల సేవలకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చైన్నె ఎగ్మూర్ నుంచి తిరునల్వేలికి ఓ రైలును నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది రాష్ట్రంలో మూడవ వందే భారత్ రైలు కానుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 652 కి.మీ దూరం 7.50 గంటల ప్రయాణ సమయంతో ఈ రైలు దూసుకెళ్లనుంది. అలాగే చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ – విజయవాడ వైపుగా మరో రైలు పట్టాలెక్కనుంది. 516 కి.మీ దూరం 6.40 గంటల్లోనే వందే భారత్ దూసుకెళ్లనుంది. బుధవారం మినహా తక్కిన రోజులలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అలాగే కాసర్‌గాడ్ – తిరునంతపురం జంక్షన్ మధ్య మరో వందే భారత్ రైలు పట్టాల మీదకు రానుంది. చైన్నె ఎగ్మూర్, సెంట్రల్ రైల్వే స్టేషన్లలో ఆదివారం ఈ రైళ్లకు జెండా ఊపే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక తిరునల్వేలి – చైన్నె రైలులో శనివారం నుంచి రిజర్వేషన్లను ప్రారంభమయ్యాయి.