విస్తృతంగా సాంకేతికత
ఆధారిత సేవలు
సాక్షి, చైన్నె: సాంకేతికత ఆధారిత సేవలను ప్రజలకు విస్తృతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టామని కోగ్నోజ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు లోకేష్ నిగమ్ తెలిపారు. ఇందు కోసం ఏర్పాటు చేసిన కాన్వెర్జ్ ఏఐ సాప్ట్‌వేర్‌ను గురువారం స్థానికంగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసేవలకు టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను విశదీకరించారు. ఏఐ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత నియామక పరిష్కారంగా సాప్ట్‌వేర్ ఉంటుందన్నారు. అంతే కాకుండా వ్యక్తిత్వ లక్షణాలు, సామర్థ్యాలు, ప్రేరణ, ఇంటర్వ్యూలు, భావోద్వేగాల అంచనాకు దోహదకరంగా పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొనడం, పరిష్కరించడం, అధిక ఖర్చులు, అధిక అట్రిషన్ రేట్లు, ఉత్పాదకతలకు పొడిగింపు, నైపుణ్యాలు, ఉద్యోగ పాత్ర, సుదీర్ఘమైన నియామక ప్రక్రియలు ఉన్న ఈ సాప్ట్ వేర్ ఓ కొత్త ఒరవడి అని పేర్కొన్నారు.
అయ్యనార్ శిల్పం లభ్యం
అన్నానగర్: వడనెర్‌కుండ్రం గ్రామంలో గురువారం 8వ శతాబ్దానికి చెందిన అయ్యనార్ శిల్పం లభించింది. విల్లుపురం శాసనాల పరిశోధకుడు వీరరాఘవన్, అశివిక పరిశోధకుడు సురేందర్ విల్లుపురం జిల్లాలోని గ్రామాల్లో లభించిన అయ్యనార్ శిల్పాలపై పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్త ఉత్రాదం తెలిపిన సమాచారం మేరకు గురువారం మరక్కాణం తాలూకా వడనెర్ కుండ్రం గ్రామంలో తవ్వకాలు చేపట్టారు. ఆ సమయంలో 8వ శతాబ్దానికి చెందిన పల్లవర్ కొరటవాయి, విష్ణు, 15వ శతాబ్దానికి చెందిన అయ్యనార్ విగ్రహం లభించాయి. అయ్యనార్ శిల్పం 334 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఉందని పేర్కొన్నారు.
ఎద్దు దాడిలో గాయపడ్డ
వ్యక్తి మృతి
తిరువళ్లూరు: ఎద్దు దాడిలో తీవ్రంగా గాయపడి చైన్నె వైద్యశాలలో చిక్సిత పొందుతూ వచ్చిన ఓ వ్యక్తి గురువారం మృతి చెందాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మన్నవేడు గ్రామానికి చెందిన సాల్మన్ కుమారుడు థామస్(56) ఇతడికి జత ఎద్దులున్నాయి. వీటిని మేపడానికి రెండు రోజుల క్రితం పొలం వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఒక ఎద్దు థామస్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు థామస్‌ను చైన్నె వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ చిక్సిత పొందుతూ గురువారం ఉదయం మరణించాడు. మృతుడు కుమారుడు కన్నన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.