అన్నానగర్: చిన్నారి హత్య కేసులో బాబాయ్‌ను అరెస్ట్ చేశారు. కళ్లకురిచ్చి జిల్లా తిరుకోవిలూరు సమీపంలోని తిరుప్పలపండాల్ గ్రామం మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన గురుమూర్తి (24). ఇతని భార్య జగదీశ్వరి. ఈ దంపతులకు తిరుమూర్తి (2) కుమారుడు, భువనేశ్వరి అనే నెల కుమార్తె ఉన్నారు. గురుమూర్తి బెంగళూరులో లగేజీ ఆటో నడుపుతున్నాడు. గురుమూర్తి తమ్ముడు రాజేష్ (22) కూడా బెంగళూరులో ఆటో నడుపుకుంటూ కొన్ని రోజులకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో జగదీశ్వరిపై మనసుపడి కోరిక తీర్చాలంటూ వదినను కోరాడు. నిరాకరించి అతన్ని మందలించింది. దీంతో కక్ష పెంచుకున్న రాజేష్ 17వ తేదీన ఇంట్లో ఆడుకుంటున్న తిరుమూర్తిని హత్య చేసి మృతదేహాన్ని స్పీకర్ బాక్స్‌లో దాచి పెట్టాడు. తిరుమూర్తి కనపడకపోవడంతో తిరుప్పలపండాల్ పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది. చిన్నారి అదృశ్యంపై గ్రామానికి చెందిన మహిళలు బుధవారం జగదీశ్వరితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఓ మహిళ చేయి స్పీకర్ బాక్స్‌పై పడి పెట్టె కిందపడింది. స్పీకర్ బాక్సులో చిన్నారి శవం బయటపడింది. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన కోరికను వదిన నిరాకరించడంతో ప్రతీకారంగా ఆమె కుమారుడుని చంపినట్లు రాజేష్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.