
కాంతులీనుతున్న శ్రీవారి ఆలయ మహద్వారం
గరుడ
గోవిందుని
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గరుడ సేవ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనార్థం పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండేలా సన్నద్ధం చేసింది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. గరుడ వాహన సేవను రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా రాత్రి 2 గంటల వరకు కొనసాగించేలా ప్రణాళిక రూపొందించింది. శ్రీవారి దర్శనార్థం భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని సూచించింది.
అందుబాటులో అన్నప్రసాదం
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. గ్యాలరీల్లోనూ ఉదయం నుంచిరాత్రి వరకు పులిహోర, టమాట బాత్, బిసిబేళా బాత్ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు సన్నద్ధమైంది. అలాగే భక్తుల కోసం 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేసింది. భక్తుల దాహార్తిని తీర్చేందుకు నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 524 తాగునీటి డ్రమ్ములను ఏర్పాటు చేసింది.
పటిష్ట భద్రత
బ్రహ్మోత్సవాలకు దాదాపు 1,130 మంది టీటీడీ సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా 1,200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు.
చైన్నె నుంచి గొడుగులు
గరుడసేవ రోజున శ్రీవారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి వారు చైన్నె నుంచి తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా గురువారం తీసుకువచ్చారు. సమితి ట్రస్టీ ఆర్ ఆర్ గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు గొడుగులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి అందించారు. మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గోపాల్‌జీ మాట్లాడుతూ ఈనెల 16న చైన్నె నుంచి 11 గొడుగుల ఊరేగింపు ప్రారంభమైందన్నారు. చైన్నెలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. బుధవారం రాత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించినట్టు చెప్పారు. సుమారు 19 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవలో అలంకరణ నిమిత్తం గొడుగులు అందజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.
తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
గ్యాలరీల్లో నిరంతరాయంగా
అన్నప్రసాదాలు
రీఫిల్లింగ్‌తో అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం
పకడ్బందీగా భద్రత
శ్రీవిల్లిపుత్తూరు నుంచి విశేష మాలలు
గరుడసేవలో శ్రీవారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు.పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, తమిళనాడు దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ సెల్లదొరై, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఈఓ ముత్తురాజ, ట్రస్టుబోర్డు సభ్యుడు మనోహరన్ ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు శ్రీవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గోదాదేవిని శ్రీవారి దేవేరి భూదేవి అవతారంగా పురాణాల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రశాంతి, డిప్యూటీ ఈఓ లోకనాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ స్థానాచార్యులు రంగరాజన్, సుదర్శన్ పాల్గొన్నారు.

శ్రీవిల్లి పుత్తూరు మాలలు