
చిత్తూరు నాగయ్యకు నివాళి అర్పిస్తున్న డాక్టర్ సీఎంకె రెడ్డి తదితరులు
సాక్షి చైన్నె: నటుడిగా, గాయకుడిగా, దర్శక నిర్మాతగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, దాన శీలిగా పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ఖ్యాతిగడించారని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సీఎంకె రెడ్డి కొనియాడారు. ఆయన తెలుగు వారికి గర్వకారణం అని వ్యాఖ్యానించారు. అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్ ) అధ్వర్యంలో పద్మశ్రీ చిత్తూరు నాగయ్య 119వ జయంతిని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక టి.నగర్‌లోని పనగల్ పార్కు ప్రాంగణంలోని చిత్తూరు నాగయ్య విగ్రహానికి ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డితోపాటు గొల్లపల్లి ఇజ్రాయేల్, ఏఐటీఎఫ్ శాఖలకు చెందిన సభ్యులు పెద్దఎత్తున పాల్గొని గజమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ తొలి తెలుగు సూపర్ స్టార్‌గా చిత్తూరు నాగయ్య తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలిగొందార న్నారు. 200 తెలుగు సినిమాల్లో నటించారని, అలాగే తమిళం, కన్నడ, మళయాలం తదితర భాషల్లో 160కిపైగా సినిమాల్లో నటించిన ఆయన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి భక్తి రసప్రాతలు పోషించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. ఆయా ప్రాతలతో తెలుగు కవుల పేరుప్రతిష్టలను సంపాదించిపెట్టారని తెలిపారు. తెలుగు తెరపై బహు ముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటుడిగాను పేరు సాదించారని వెల్లడించారు. అరుదైన గొప్ప నటుల్లో అగ్రగణ్యుడు చిత్తూరు నాగయ్య కొనియాడారు. గాం ధీజీ అడుగుజాడల్లో నడిచి ఉప్పు సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారని తెలిపారు. ఎంతోమందికి సాయం అందించిన ఆయన చివరి అంకంలో పేదరికంతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారికే గర్వకారణమైన చిత్తూరు నాగయ్య తెలుగు చిత్ర సీమకు ఎనలేనిసేవలు అందించారన్నారు. ఆయన వల్ల లబ్ధిపొందిన వారెవరూ జయంతి రోజున నివాళుర్పించేందుకు రాకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రసుతం పనగల్ పార్కులో మెట్రో పనుల జరుగుతున్న దృష్ట్యా చిత్తూరు నాగయ్య విగ్రహానికి ప్రమాదం కలగకుండా రక్షణ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్, టామ్స్ గొల్లపల్లి ఇశ్రాయేల్, రొడ్డా జయరాజ్ , ఏఐటీఎఫ్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఆర్. రామోధరన్, సెక్రెటరీ రఘురామ్, ఏ రవిరాజ్ , జగన్, ఎం దామోధర్, నిర్లమల్ చందర్, హరినాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.