
స్టేడియంలో పిల్లల కేరింతలు
సాక్షి, చైన్నె : చైన్నెలో బుధవారం క్రికెట్ సందడి మిన్నంటింది. అభిమానులు స్టేడియంలో హంగామా చేశారు. నిరుపేద పిల్లల కలను సాకారం చేసే విధంగా ఆర్‌సీసీ మ్యాగ్నమ్ నేతృత్వంలో స్టేడియంలోకి 500 మందిని తీసుకెళ్లారు. తమిళనాట క్రికెట్ అభిమానులు ఎక్కువే. టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లను చూడడం కన్నా ప్రత్యక్షంగా తిలకించాలన్న ఆశతో చైన్నెకి పోటెత్తుతుంటారు. దీంతో చైన్నె చేపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం కిటకిటలాడుతుంది. ఇటీవల ఈ స్టేడియాన్ని ఆధునికీకరించారు. ఇందులో 50 వేల మంది కూర్చుని మ్యాచ్‌లను వీక్షించేందుకు వీలుంది. 37 వేల మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు. బుధవారం భారత్ – ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ తిలకించేందుకు అభిమానులు వేలాదిగా చేపాక్కంకు పోటేత్తారు. ఆ పరిసరాలన్నీ అభిమానులతో నిండాయి. పోలీసు నిఘా నడుమ అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. క్రికెట్ అభిమానుల కోసం మెట్రో రైలు సేవలు నిర్ణీత సమయం కన్నా అధికంగా అర్ధరాత్రి వరకు కొనసాగాయి.
500 మంది పిల్లలతో..
క్రికెట్‌ను టీవీల్లో చూసి ఆనందంతో ఉప్పొంగి పోతాం ... అదే నేరుగా క్రికెట్‌ను చూస్తే ఇక ఆనందానికి అవధులే ఉండదు. ఇందులో భాగంగా నిరుపేద చిన్నారులు నేరుగా క్రికెట్ స్టేడియంకు వెళ్లి చూస్తే ఇక పట్టలేని సంతోషమే. తమ కల నిజమైందని తెగ మురిసిపోవడాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పటికే క్రికెట్ టిక్కెట్‌లన్నీ అమ్ముడై పోయి ఎంతోమంది అభిమానులు నిరాశ చెందుతున్న తరుణంలో నిరుపేద చిన్నారుల కలను ఆర్‌సీసీ మ్యాగ్నమ్ సంస్థ సాకారం చేసింది. చైన్నెలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించేందుకు 500 మంది నిరుపేద పిల్లలను తీసుకెళ్లారు. పిల్లలకు క్రికెట్ ప్రత్యక్షంగా తిలకించే అనుభూతిని కలిగించడంతో పాటు భోజనం తదితర సౌకర్యాలు కల్పించారు. చైన్నె రాజారత్నం స్టేడియం నుంచి ముఖ్య అతిథిగా పోలీసు సంక్షేమ విభాగం డీజీపీ కరుణాసాగర్, జాయింట్ పోలీసు కమిషనర్–చైన్నె (ఈస్ట్) దిషా మిట్టల్ పాల్గొని చెక్ దే ఇండియా జెండాను ఆవిష్కరించి చిన్నారులను నేరుగా చేపాక్‌లోని చిదంబరం స్టేడియంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రత్న అవార్డు గ్రహీత లలితా జంగ్రా, మంగళ్‌చాంద్‌జీ దాదర్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ గౌరవ కోశాధికారి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
అభిమానుల హంగామా
నిరుపేదల కల సాకారం చేసిన ఆర్‌సీసీ మ్యాగ్నమ్

స్టేడియం వద్ద అభిమానుల సందడి