
తండ్రి మృతదేహం ముందు వధువుకు తాళి కడుతున్న కుమారుడు
గుండెనొప్పితో మృతి చెందిన తండ్రి మృతదేహం ముందు నిశ్చితార్థం
అన్నానగర్: గుండెనొప్పితో మృతి చెందిన తండ్రి మృతదేహం ముందు నిశ్చితార్థం చేసుకున్న మహిళను కొడుకు పెళ్లి చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. వివరాలు.. కళ్లకురిచ్చి సమీపంలోని పెరువాన్కూరు గ్రామానికి చెందిన రాజేంద్రన్ (70) డీఎంకే ప్రముఖుడు. ఇతను స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. ఇతని భార్య అయ్యమ్మాళ్. పెరువంగూర్ పంచాయతీ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
వీరి కుమారుడు ప్రవీణ్. బి.కాం పట్టభద్రుడు. చైన్నె మేడవాక్కంలో నివసిస్తున్న షణ్ముగనాథన్.. సుభాషిణి దంపతుల కుమార్తె స్వర్ణమాల్యకు, ప్రవీణ్‌కు పెళ్ల చేయాలని తల్లిదండ్రులు, బంధువులు నిశ్చయించారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. మార్చి 27న కళ్లకురిచ్చిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇరు కుటుంబాల వారు పెళ్లి పత్రికలు ముద్రించి బంధువులు, స్నేహితులు, పార్టీ నాయకులకు ఇచ్చారు. ఈ స్థితిలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాజేంద్రన్ ఛాతినొప్పితో హఠాత్తుగా మృతి చెందాడు.
కుమారుడి వివాహం జరగనున్న తరుణంలో రాజేంద్రన్ మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రవీణ్ తన తండ్రి ఆశీర్వాదం పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఇరు కుటుంబాలు, బంధువులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రి మృతదేహం ముందే అతనితో నిశ్చితార్థం అయిన మహిళను వివాహం చేసుకున్నాడు. కాగా తండ్రి మృతదేహం ముందే కొడుకు పెళ్లి చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది.