
తెలుగు ఉగాది పర్వదినం శ్రీశోభకృతనామ సంవత్సరానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని ఆలయాలను యంత్రాంగం చూడముచ్చటగా తీర్చిదిద్దింది. అరటి పిలకలు, మామిడితోరణాలు, వివిధ రకాల పూలు, విద్యుద్దీప కాంతులతో ప్రత్యేక అలంకరణలు చేపట్టింది. ప్రధానంగా పులుపు, వగరు, తీపి, కారం, ఉప్పు, చేదు కలగలిపి షఢ్రుచులతో తయారుచేసిన ఉగాది పచ్చడిని ఉదయం నుంచి భక్తులకు పంపిణీ చేయనుంది.
అలాగే ప్రముఖ అవధానులు, ఆగమసలహాదారుల ఆధ్వర్యంలో పంచాగశ్రవణాన్ని
భక్తులకు విశదీకరించనుంది.
సాక్షి, తిరుపతి: తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలకు ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తిరుమల శ్రీవారి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, నారాయణవనంలో శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం వంటి ముఖ్యమైన ఆలయాలతో పాటు.. ప్రతి గ్రామంలోని ఆలయాలన్నింటిలోనూ ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. అందుకోసం ఆలయాలన్నింటినీ వివిధ పుష్పాలతో విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పంచాంగశ్రవణం, ఆస్థానం నిర్వహించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించనున్నారు.