
కొత్త పాలసీ పత్రాన్ని విడుదల చేసి మంత్రి దురై మురుగన్‌కు అందిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె : కృత్రిమ ఇసుక (ఎం శాండ్) ఉత్పత్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సచివాలయం వేదికగా గురువారం ఈ పాలసీని సీఎం స్టాలిన్ విడుదల చేశారు. వివరాలు..రాష్ట్రంలో గతంలో నెలకొన్న ఇసుక కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా ఎం శాండ్‌ను తీసుకొచ్చారు. కాల క్రమేనా ఎం శాండ్ లేని నిర్మాణాలే లేవన్నట్లు పరిస్థితులు మారాయి. ప్రైవేటు గుప్పెట్లోకి ఈ వ్యాపారం చేరడంతో పాటు ధరలు అమాంతంగా పెరిగాయి. అదే సమయంలో ఈ ఎం శాండ్‌లో నాణ్యత లేదని, దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో ఎం శాండ్ నియంత్రణ, ఖనిజ సందపలు, సహజన వనరుల పరిరక్షణ, భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా, ఎం శాండ్ కోసం 2023 పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణం ఈ పాలసీ అమల్లోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టారు.
వ్యర్థాలను తగ్గించేందుకు..
కృత్రిమ ఇసుక ఉత్పత్తికి తీసుకొచ్చిన కొత్త పాలసీలో కొన్ని కీలక అంశాలను ప్రభఉత్వం వెల్లడించింది. ఇందులో సహజ వనరులైన నదుల్లో ఇసుక కొరత ఏర్పడినప్పుడు కొత్త పర్యావరణ, భూ వినియోగ చట్టం అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. ఈ సమయంలో మాత్రమే ఎం శాండ్ మీద దృష్టి పెట్టాలన్నారు. ఎం శాండ్ తయారీ కారణంగా ఉత్పన్నమయ్యే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించేందుకు క్వారీలపై కఠిన నిబంధనలు విధించారు. తయారీలో నాణ్యత కొరవడిన పక్షంలో కొరాడా ఝుళిపించేందుకు ప్రత్యేక చర్యలను వివరించారు. ఇక, ఈ పాలసీలో మరికొన్ని ముఖ్య అంశాలను వివరించారు. నది ఇసుకను సురక్షితంగా ఉపయోగించడం, పర్యావరణానికి నష్టం కలకుండా నిరోధించడం, బ్యూరో ఆఫ్ కంట్రోల్(బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలు పాటించడం, ఎం శాండ్ తయారీకి పరిశ్రమలకు అనుమతులు విషయంగా విధాన పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భవనాలు, కాంక్రీట్ నిర్మాణాలు, క్వారీ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేయడం, కృత్రిమ మైనింగ్, క్వారీలను ప్రోత్సహించేందుకు తగిన సూచనలు ఇచ్చారు. ఇక, ఇసుక తవ్వకాలు, ఉత్పత్తి కోసం వ్యక్తిగత క్వారీలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దురై మురుగన్, సీఎస్ ఇరై అన్భు, సీనియర్ ఐఏఎస్‌లు కృష్ణన్, జయకాంతన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పట్టు ఉత్పత్తి రంగంలో రాణించిన 9 మందికి సీఎం స్టాలిన్ రూ. ఆరు లక్షలు నగదు ప్రోత్సాహాలను అందజేశారు.
విడుదల చేసిన సీఎం స్టాలిన్
ప్రైవేటు క్వారీలకు చెక్