
ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉద్దానంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణకు సిద్ధమైనట్లు కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ, ప్రజాసంఘాల నాయకులు, బాధిత రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మండలంలోని చీపురపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమను తలపించే పచ్చని ఉద్దాన ప్రాంతాన్ని, తీరప్రాంతాన్ని ధ్వంసం చేసే కార్గో ఎయిర్‌పోర్టు వద్దన్నారు. తమ అభిప్రాయాలను పలువిధాలుగా ప్రభుత్వానికి చెప్తున్నా తమ గోడు వినిపించుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో తమ బతుకులను రోడ్డున పడేయాలని కంకణం కట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొరమ వాసు, నాయకులు జె.అప్పారావు, దున్న హరి, కె.తులసీదాస్, లోకనాథం, రాజు, దమయంతి, జి.లోకనాథం, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా బుధవారం ఉదయం కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి భారీ యంత్రాలతో సర్వే పేరిట ఈ ప్రాంతానికి వచ్చారు. ఇది గమనించిన బాధితులు చేరుకొని వాహనాలను నిలుపుదల చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోర్టు వద్దు.. మా ప్రాంతం ముద్దు అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మందసలో...
ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈనెల 5వ తేదీన ఉదయం 9 గంటలకు ఒంకులురు గ్రామ కమ్యూనిటీ భవనంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఈ ప్రాంతానికి తీవ్రనష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బత్తిన లక్ష్మణరావు, దున్న హరికృష్ణ, కొండ తులసీదాస్, లోకనాథం, భాస్కరరావు, సుంకర రాజు తదితరులు పాల్గొన్నారు.