
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): లేబర్ కోడ్‌లు రద్దు, పని గంటలు పెంపు, సుప్రీంతీర్పు ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుతూ జూలై 9వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు టి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.అప్పలరాజు, మున్సిపల్ ఇంజినీరింగ్ జిల్లా కార్యదర్శి ఆర్.సతీష్‌లు పిలుపునిచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద కరపత్రాలు గురువారం ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా, అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కార్మికులకు సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వై.శ్యామలరావు, సరస్వతీ, కరుణ, జి.లక్ష్మి, పార్థసారధి, జె.గురుమూర్తి, రసూల్, చంటి తదితరులు పాల్గొన్నారు.