
బలగవీధిలో ఇల్లు దగ్ధం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని బోడెమ్మకోవెల సమీపంలో బలగవీధిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి రూ.1.70 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి కె.శ్రీనుబాబు వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. గార మండలం కొర్లాం గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న కుప్పిలి రామామణి బలగవీధిలో పెంకుటిల్లులో కుమారుడు లోకేష్‌తో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నారు. లోకేష్ విశాఖలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం విధుల నిమిత్తం రామామణి కొర్లాం వెళ్లింది.
దేవుని గుడిలో ఉన్న దీపం ప్రమిద మంచంపై పడి మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురై ఆర్పేందుకు యత్నించారు. ఈలోగా ఫైర్ సిబ్బంది జీవీకే నాయుడు, ఎస్ ప్రసాద్, ఎం.శ్రీనివాస్, డి.శ్రీనివాస్, పి.జగన్నాథరావు, వై.పాపారావులు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామాన్లు కాలిపోయాయి.