
మా ఊరు బడి.. మాకు కావాలి
ఆమదాలవలస: మండలంలోని గాజుల కొల్లివలస పాఠశాలను ఆర్‌ఆర్ కాలనీలో విలీనం చేయడం ప్రభుత్వానికి తగదని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ మేరకు పాఠశాల వద్ద బుధవారం నిరసన చేపట్టారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాల తరలించే ప్రయత్నం మానుకోవాలని లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే వారం రోజులుగా విద్యార్థులకు హాజరు కూడా వేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించకుంటే దశలవారీగా దీక్షలు చేసి నిరాహార దీక్ష చేపట్టేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు మొండేటి కూర్మారావు, విద్యార్థుల తల్లిదండ్రులు సవలపురపు కృష్ణ, శ్రీనుగోక రమేష్, పాలకొండ శంకర్, నవిరి రమణ, నీలవేణి, శంకర్, సంగమేశ్వర్, సవలాపురపు శాంతి కుమారి, రాజు, పైడి లక్ష్మి, నవిరి రాజు, రాణి, గొర్రెల సంధ్య, దుప్పలపూడి రజిని తదితరులు పాల్గొన్నారు.