
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
హిరమండలం: అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మండలంలో కల్లట గ్రామంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో టెక్కలి డివిజన్‌లోని తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, హెచ్‌డీటీలు ఆర్‌ఎస్‌డీటీలు, మండల సర్వేయర్లు, వీఆర్వోలతో రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వినతులు, నిషేదిత భూముల వివరాలు, ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్ తదితర రెవెన్యూ అంశాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పలు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు సరైన సమాచారం చెప్పకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో వినతుల పరిష్కారంపై మండల గ్రీవెన్స్ మానిటరింగ్ అధికారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిరోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
రైతులకు అవగాహన కల్పించాలి
రీ సర్వేలో ల్యాండ్ ఎల్‌పీఎం(ల్యాండ్‌పాస్ మ్యాప్) గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. రైతులు భూహద్దులు నిర్ణయించుకుని ఎల్‌పీఎంలు చేసుకోవడం వలన రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తిస్తాయన్నారు. దీనిపై గ్రామ, మండల సర్వేయర్లకు స్పష్టమైన సూచనలు చేశారు. ఏపీ సేవా, మీసేవాలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ అంశాల సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ సహాయక కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, జిల్లా భూసర్వే, రికార్డుల నిర్వహణ అధికారి కె.రమేష్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డివిజన్ స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు