
పోడు పంటలకు ముప్పు
టెక్కలి: ఇష్టారాజ్యంగా సాగుతున్న కంకర తవ్వకాలతో పోడు పంటలకు ముప్పు వాటిల్లుతోంది. టెక్కలి మండలం గూడెం గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండపై కొన్నాళ్లుగా విచ్చలవిడిగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో తమ జీవనాధారమైన పోడు పంటలు నాశనమవుతున్నాయని సవర సీతాపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామానికి చెందిన గిరిజనులకు ఇదే కొండపై పోడు వ్యవసాయానికి సంబంధించి పట్టాలు అందజేశారు. దీంతో వారంతా జీడి, మామిడి పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరుగుతున్న సమయంలో కొందరు అక్రమార్కులు కొండపై విచ్చలవిడిగా కంకర తవ్వకాలు చేపడుతున్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతుండటంతో పంట మొక్కలు నాశనమవుతున్నాయని, తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని గిరిజన రైతులు వాపోతున్నారు.
పోర్టు పేరిట..
మూలపేట పోర్టుకు కంకర తరలింపు పేరుతో గూడేం కొండను పూర్తిగా మైదానంగా మార్చేశారు. నందిగాం మండలం సొంటినూరు రెవెన్యూ పరిధిలో ఉన్న ఇదే కొండపై గతంలో వన్యప్రాణులు సంచరిస్తూ ఉండేవి. ఇదే ప్రాంతం నుంచి గతంలో దుప్పిలు, జింకలు, కొండ గొర్రెలు, నెమళ్లు దారి తప్పి సమీప గ్రామాలకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కొండపై చేస్తున్న కంకర తవ్వకాలతో ఒక వైపు గిరిజన రైతులకు, మరో వైపు వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
నాశనం చేస్తున్నారు...
గూడెం కొండపై గతంలో మాకు పోడు వ్యవసాయానికి పట్టాలు ఇచ్చారు. దీనిపై జీడి, మామిడి పంటలు సాగు చేస్తున్నాం. ఇప్పుడు కంకర తవ్వకాలు చేస్తుండటంతో మొక్కలు నాశనమైపోతున్నాయి. మా పంటలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
– చందనగిరి కృష్ణారావు, గిరిజన రైతు, సవర సీతాపురం, టెక్కలి మండలం
పోడు పంటలే దిక్కు..
మా గ్రామస్తులకు కొండపై ఉన్న పోడు పంటలే దిక్కు. అటువంటి పంటలను నాశనం చేసే విధంగా కంకర తవ్వుతున్నారు. దీనిపై ఐటీడీఏ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాం.
– ఐ.రజని, సవర సీతాపురం,
టెక్కలి మండలం
గూడెం కొండపై విచ్చలవిడిగా కంకర తవ్వకాలు
పోడుపంటలు నాశనం కావడంతో గిరిజన రైతుల ఆందోళన
ఇదే కొండపై వన్యప్రాణుల ఆనవాళ్లు

పోడు పంటలకు ముప్పు

పోడు పంటలకు ముప్పు

పోడు పంటలకు ముప్పు