
పనుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మొక్కలు నాటి సంరక్షణ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డ్వామా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, పంచాయతీ రహదారుల వెంట మొక్కలు నాటి వాటికి సంరక్షణ చేయాలన్నారు.
టెక్కలిలో జంగిల్ క్లియరెన్స్ చేసి మొక్కలు నాటినట్లు మండలాల్లో కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి మొక్కలు నాటాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు, ఉద్యానవన శాఖకు సంబంధించిన సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు జాబ్ జారీ చేసిందీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీడీ బి.సుధాకర్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎవరికి నిర్ణయించిన పనులు వారు సత్వరమే నిర్వహించి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ బి.సుధాకర్, ఏపీడీలు పి.రాధ, శైలజ, శ్రీనివాసరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి బి. లవరాజు, ఫీల్డ్ ఆఫీసర్లు, డ్వామా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.