
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్:
ఏపీఎస్ ఆర్టీసీలో మూడు వేల మందికి పదోన్నతులు కల్పించాలని, కొత్తగా 10 వేల మందికి నియామకాలు(రిక్రూట్‌మెంట్) చేపట్టాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.నానాజీ, జిల్లా అధ్యక్షుడు జి.త్రినాథరావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కార్యాలయ ఆవరణలో ఈయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించాలని, పాతపద్ధతిలోనే వైద్య సదుపాయాలు కల్పించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని, 1/19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారిని ఆప్కాస్‌లో చేర్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.బి.రావు, ఎస్.వి.రమణ, కె.బాబూరావు, పి.వి.ఆర్.ఎల్.లలితకుమారి, జి.బి.మూర్తి, బి.రామకృష్ణ, కె.జి.రావు, వై.కె.కుమార్, ఆర్.వి.రావు, ఎ.ఎస్.చలం, బి.సుజాత, పి.ఎస్.కుమార్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు టి.ముత్యాలరావు, కిరణ్, నవీన్, అనిల్ పాల్గొన్నారు.