
నేడు నష్టాల్లో!
నరసన్నపేట :
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్ది వారి కుటుంబాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనింపజేసేందుకు వైఎస్సార్ సీపీ పాలనలో ఏర్పాటైన మహిళా మార్టులు కూటమి ప్రభుత్వం వచ్చాక కుదేలయ్యాయి. జిల్లాలోనే అత్యధిక వ్యాపారం చేసిన నరసన్నపేటలోని మహిళా మార్టు ప్రస్తుతం మూతపడింది. గత 15 రోజులుగా షాపు తెరవడం లేదు. 2022 డిసెంబర్ 14న సెర్ప్, డీఆర్‌డీఏ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మార్టును ప్రారంభించారు. మంచి వ్యాపారం చేపట్టి రాష్ట్రంలోనే నరసన్నపేట మార్టు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ రూ.5 కోట్లు పైగా టర్నోవర్ సాధించింది. పది మంది వరకూ మహిళలు ఇందులో పనిచేసేవారు.
కూటమి వచ్చాక తిరోగమనం..
నిత్యం లక్షలాది రూపాయం వ్యాపారం చేస్తూ ఆదర్శంగా ఉన్న నరసన్నపేట మహిళా మార్ట్‌ను కూటమి ప్రభుత్వం వచ్చాక నీరుగార్చారు. డీఆర్‌డీఏ అధికారులు కూడా దీనిపై దృష్టి తగ్గించారు. దీంతో ఏడాది కాలంలో మార్టు తిరోగమనంలో నడిచింది. గతంలో రోజూ రూ.40 వేల నుంచి లక్ష రూపాయలు పైబడి వ్యాపారం జరిగేది. దీంతో పాటు మహిళా సంఘాల ఆద్వర్యంలో తయారయ్యే ఉత్పత్తుల విక్రయాలు కూడా ఇక్కడ జరిగేవి. తద్వారా ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకే అందేవి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్టు కావడంతో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ఇలాంటి మార్టును మూసేయడం పట్ల స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
షేర్ ధనం ఎక్కడ?
నరసన్నపేట మండలంలో 1998 మహిళా సంఘాలు ఉండగా దీంట్లో 24,512 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 22,500 మంది నుంచి మహిళా మార్టు కోసం రూ.110 చొప్పున వసూలు చేశారు. వీరందరికీ షేర్ ధనం రూపంలో భాగసామ్యం కల్పించారు. ప్రస్తుతం ఈ షేర్ ధనం కూడా మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బు ఏమైందని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద వసూలు చేసిన షేర్ ధనం మొత్తం తిరిగి చెల్లించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలుదారులతో మార్ట్ కౌంటర్(ఫైల్ )
లాభాల్లోనే అప్పగించాం..
బాగా వ్యాపారం చేశాం. ప్రభుత్వం మారేటప్పటికి లాభాల్లోనే ఉండేది. స్వయం శక్తి సంఘాలకు ఇచ్చేందుకు రూ.3 లక్షలు పక్కన పెట్టాం. సరుకులు కూడా అధికంగా ఉండేవి. దీనిని కొనసాగించాలి.
– చింతు శ్రీదేవి,
మాజీ ఎంఎంఎస్ అధ్యక్షురాలు, నరసన్నపేట
పునఃప్రారంభిస్తాం..
మహిళా మార్ట్ భవనం కొంత మరమ్మతులు చేపట్టాలి. తర్వాత పునఃప్రారంభించాలని పీడీ అంటున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి సరుకులు ప్యాక్ చేసి ఉంచాం.
– అప్పలరామయ్య,
ఏపీఎం, నరసన్నపేట