కనికరించాలి మీరు! | - | Sakshi
Sakshi News home page

కనికరించాలి మీరు!

Jul 6 2025 6:31 AM | Updated on Jul 6 2025 6:31 AM

 కనిక

కనికరించాలి మీరు!

సారూ..
● ఇప్పటికే అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు సతమతం ● తమ బాధలు పట్టించుకోవాలని ‘అధికారి’కి విన్నపం

శ్రీకాకుళం క్రైమ్‌ : అంతుబట్టని ‘అధికారి’ వ్యూహం పేరిట శుక్రవారం ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లావ్యాప్తంగా ఇటీవల బదిలీలైన పోలీసుల్లో అన్యాయంగా దూరంగా వెళ్లిపోయి బాధపడినవారంతా తమ గోడు కనీసం పత్రికలోనైనా వచ్చినందుకు సంతోషపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో అంతా తానై వ్యవహరించిన ఆ అధికారి దగ్గరుండి మరీ బదిలీల కౌన్సిలింగ్‌ ప్రక్రియ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి పాలకుల కక్ష, ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం తమ విభాగానికి చెందిన ఆ ‘అధికారి’ అయినా తమ కష్టసుఖాలు అర్ధం చేసుకుంటే చాలని వేడుకుంటున్నారు.

కాస్త ఉపశమనం..

రాజకీయ సిఫార్సులు పట్టించుకోలేదని, నిజాయితీగా, పారదర్శకంగా చేశారని, తప్పు చేసిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారని ‘అధికారి’ని ఆకాశానికెత్తినవారు కొందరైతే.. తమకు అన్యాయం జరిగిందని, ఆరోగ్యం, వయసు దృష్టిలో పెట్టుకోకుండా ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారిని సైతం దూరంగా బదిలీ చేశారని, పోనీ పనిష్మెంట్ల పేరిట పంపించేశారంటే అదీ కాదని బాధపడినవారూ ఉన్నారు. ముందుగా బదిలీ అయిన 221 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లలో ఇలా బాధపడినవారు అధికం. అధికారి అర్థం చేసుకున్నారో ఏమో గానీ శుక్రవారం జరిగిన 97 మంది పీసీలు, హెచ్‌సీల తుది విడత బదిలీల్లో సమీపం పోలీస్‌స్టేషన్‌లలోనే వేసి వారికి కాస్త ఉపశమనం కల్పించారు.

మహిళా పోలీసులది మరోబాధ..

తాజాగా బదిలీ అయిన సచివాలయ మహిళా పోలీసులు కూడా తమ గోడును వారి వాట్సాప్‌ గ్రూపుల్లో పంచుకుంటున్నారు. తమ కుటుంబం, పిల్లలు, ఆరోగ్య సమస్యలనైనా దృష్టిలో పెట్టుకుని పక్కనున్న సచివాలయాల్లో గానీ, ఒకటి రెండు మండలాలు దాటైనా బదిలీ చేసుంటే బాగుండేదని అనుకుంటున్నారు. 50 కిలోమీటర్ల దాటైతే రోడ్లపై ఉరుకుల పరుగులతో స్కూటీలపై వెళ్లి ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వస్తుందోనని భయపడుతున్నారు. మరికొందరైతే మహిళా పోలీసులు అవసరం లేని చోట బదిలీ కావడంతో వీరిని భవిష్యత్తులో పోలీసు శాఖలోనే ఏదైనా విభాగంలో విధుల్లోకి తీసుకుంటారా.. లేదో తెలియని పరిస్థితి. శుక్రవారం ఇలాంటి వారంతా పోలీసుల గ్రీవెన్సులో మొరపెట్టుకునేందుకు వెళ్లారు. ఆర్డర్లు వచ్చాక చూడొచ్చులే.. రాలేదు కదా.. కొన్నిరోజులు చేశాక తెలుస్తుందిలే.. అంటూ అక్కడి కార్యాలయ సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. శనివారం వీరి బదిలీల లిస్టు జిల్లా కలెక్టర్‌ ఆమోదానికి వెళ్లిందని జిల్లా పోలీసు కార్యాలయ సమాచారం.

‘వీఆర్‌’లకు మోక్షం కలిగేనా?

దాదాపు కూటమి పాలన వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సీపీ ముద్రతో పాటు వివిధ కారణాలతో వీఆర్‌లో ఉన్న సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసులు ఎక్కడా పోస్టింగ్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ కక్షతో కొందరు కూటమి నాయకులు రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగంగా ముందుగానే వారి పేర్లున్న లిస్టు పైనున్న ఉన్నతాధికారులకు ఇచ్చేశారని అనుకున్నా.. ఏ రాజకీయ నాయకునికి తలొగ్గరని పేరున్న ఇక్కడ అధికారి కనికరం చూపిస్తే రెగ్యులర్‌ విధుల్లో తాము చేరడం పెద్ద కష్టమేమీ కాదని వీరు భావిస్తున్నారు. ఆ విధంగానైనా మోక్షం లభిస్తుందో లేదో చూడాలిమరి.

 కనికరించాలి మీరు!1
1/1

కనికరించాలి మీరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement