
టెక్కలిలో కల్తీ సిగరెట్ల కలకలం
టెక్కలి: సిగరెట్లు తాగడమే ఆరోగ్యానికి హానికరమైతే.. అందులో కల్తీ సిగరెట్లును విచ్చలవిడిగా విక్రయిస్తూ ధూమపానప్రియుల ఆరోగ్యాన్ని మరింత హరింపజేస్తున్నారు. డివిజన్ కేంద్రమైన టెక్కలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ సిగరెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఒడిషా ప్రాంతం నుంచి టెక్కలి మీదుగా శ్రీకాకుళం, విశాఖ తదితర ప్రాంతానికి వీటిని తరలిస్తున్నారు. ముఖ్యంగా అధిక ధర కలిగిన కొన్ని రకాల సిగరెట్లును పోలిన విధంగా కల్తీ సిగరెట్ ప్యాకెట్‌లను దిగుమతి చేస్తున్నారు. కొన్ని రకాల ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వాహనాలు, బస్సుల్లో నేరుగా తరలిస్తూ పట్టణ, గ్రామాల్లోని పాన్‌షాపులకు విక్రయిస్తున్నారు. ఒరిజినల్‌ను పోలిన విధంగా కల్తీ సిగరెట్లు ఉండడంతో, వాస్తవ ధరలకే వాటిని కొనుగోలు చేసుకుని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల టెక్కలిలో కొన్ని రకాల కంపెనీలకు చెందిన ప్రతినిధులు విస్తృతంగా దాడులు చేసి కల్తీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయినప్పటికీ పట్టణంలో గతంలో అక్రమంగా గుట్కాలను సరఫరా చేసే కొంతమంది వ్యక్తులు ఇష్టారాజ్యంగా కల్తీ సిగరెట్లు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.