
నిధుల్లేవు.. అభివృద్ధి ఎలా..?
ఇచ్ఛాపురం రూరల్: పంచాయతీలను అభివృద్ధి చేద్దామంటే ఇప్పటి వరకు మంజూరు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు మంజూరు చేయలేదు, ఇక అభివృద్ధి చేయమంటే ఎలా అంటూ మండల సర్పంచ్‌లు ఎంపీడీఓను నిలదీశారు. శుక్రవారం ఎంపీపీ బోర పుష్ప ఆధ్వర్యంలో మండలంలోని 21 పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు ఎంపీడీఓ కె.రామారావుకు వినతి పత్రం అందజేశారు. పంచాయతీలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయడానికి, వీధి దీపాలు వేసేందుకు, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ వేసేందుకు పంచాయతీలో ‘జీరో’ నిధులు కావడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
తల్లికి తలకొరివి పెట్టిన తనయ
వజ్రపుకొత్తూరు: పాత టెక్కలిలో శుక్రవారం తల్లికి తలకొరివి పెట్టిన హృదయ విదారక ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగ్గిలాపు భాగ్యలక్ష్మీ (60) కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. భర్త 30 ఏళ్ల కిందటే మృతిచెందగా.. కుమార్తెలు సంతోషికుమారి, నాగమణిలకు వివాహాలు జరిగాయి. తల్లి అనారోగ్యానికి గురైనప్పటి నుంచి పెద్ద కుమార్తె సంతోషికుమారి పాత టెక్కలి వచ్చి తల్లి బాగోగులు చూసుకుంటోంది. భాగ్యలక్ష్మి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మృతిచెందింది. దీంతో కుమార్తె సంతోషికుమారి అన్నీ తానై తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది.
చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు
నరసన్నపేట: జలుమూరు మండలం రాణ, రామకృష్ణాపురం గ్రామాల్లో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడు ఒకరేనని సీఐ ఎం.శ్రీనివాసరావు శుక్రవారం నరసన్నపేట సర్కిల్ స్టేషన్ వద్ద విలేకరులకు వెల్లడించారు. జలుమూరు మండలం యాళ్లపేటకు చెందిన మడ్డు మాధవరావు 2023 మార్చి 6న రాణ గ్రామం మెయిన్ వీధిలో తాళం వేసి ఉన్న కొంగరాపు పుణ్యవతి ఇంట్లో చొరబడ్డాడు. స్క్రూ డ్రైవర్ సహాయంతో బీరువా తెరిచి రెండు తులాల బంగారు గొలుసు, తులమున్నర పుస్తెలతాడు చోరీకి పాల్పడ్డాడు. 2024 ఆగస్టు 27న రామకృష్ణాపురంలో తాళం వేసి ఉన్న మరో ఇంటిలో బీరువా తెరిచి చిన్న పిల్లల బంగారు చైన్లు , చెవి బుట్టలుతో పాటు మొత్తం మూడు తులాల ఆభరణాలు చోరీ చేశాడు. ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా శుక్రవారం ఉదయం తిలారు రైల్వే స్టేషన్ వద్ద అనునానాస్పదంగా మాధవరావు కనిపించడంతో పట్టుకున్నారు. విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. ఇతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఇంటర్ వరకూ చదువుకున్న మాధవరావు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సమావేశంలో జలుమూరు ఎస్‌ఐ అశోక్‌బాబు పాల్గొన్నారు.

నిధుల్లేవు.. అభివృద్ధి ఎలా..?

నిధుల్లేవు.. అభివృద్ధి ఎలా..?