
ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం
కంచిలి : పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనే ధ్యేయంగా బోధన సాగించాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య అన్నారు. కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల జెడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషలాఫీసర్లు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచాలని, ట్రాన్సిషన్ 100 శాతం జరగాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు సకాలంలో నమోదుకావాలని సూచించారు. సమావేశంలో నాలుగు మండలాల ఎంఈఓలు అప్పారావు, శివరాంప్రసాద్, చిట్టిబాబు, జోరాడు, కృష్ణంరాజు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. అనంతరం పురుషోత్తపురం, ఎస్.ఆర్.సి.పురం ప్రాథమిక పాఠశాలల్ని డీఈఓ తనిఖీ చేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. మోడల్ ప్రైమరీ స్కూల్ స్థాయిలో రోల్ పెంచినందుకు మౌలిక వసతుల కల్పనలో తనవంతు సహాయం చేస్తానని, ఒక ఉపాధ్యాయుడ్ని కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎస్.శారద, ఉపాధ్యాయులు నల్లాన రవి, సీఆర్‌ఎంటీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.