
బదిలీల్లో నిబంధనలకు తూట్లు
శ్రీకాకుళం: జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ జరుగుతుండటంతో సిబ్బంది ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలో బదిలీ ప్రక్రియ ప్రారంభి అవుతుందని ప్రకటించడంతో వారంతా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చేరుకున్నారు. 605 మందికి ఈ బదిలీలు చేపట్టాల్సి ఉంది. జూన్ 28నే బదిలీలు జరగాల్సి ఉన్నా సీనియారిటీ జాబితా తదితర అంశాలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రక్రియను సోమవారం నాటికి వాయిదా వేశారు. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో జరుగుతున్న నియమకాలు, బదిలీలపై తరచూ ఆరోపణలు వస్తుండం, మీడియాలో కథనాలు ప్రచురిచతం కావడంతో ఈసారి ఎవరికీ తెలియకూడదని యోచించారో ఇంకేమైనా కారణముందో తెలియదు గానీ కౌన్సెలింగ్ అర్థరాత్రి చేపట్టారు. ఉదయం నుంచి పడిగాపులు కాసిన హెల్త్ సెక్రటరీలు సోమవారం రాత్రి 8 గంటల వరకు వేచిచూడల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభమైన బదిలీల ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగింది.
అమలుకాని నిబంధనలు..
వాస్తవానికి నియామకాలు, బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ రాత్రి వేళ జరపకూడదన్న నిబంధనలు ఉన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఏమాత్రం పట్టించుకోలేదు. హెల్త్ సెక్రటరీలకు వారి సొంత గ్రామాల్లో నియమించకూడదని, పట్టణ, నగర ప్రాంతాల్లో పనిచేసిన వారికి అదే ప్రాంతంలో వేరొక సచివాలయానికి బదిలీ చేయాలని, మండల సచివాలయాల్లో పనిచేసిన వారికి అదే మండలంలో వేరోక సచివాలయానికి బదిలీ చేయాలని ఆదేశించినా అమలు కాలేదు. నగరంలో పనిచేసిన కొందరిని వేరొక మండలంలో నియమించగా, మండలంలో పనిచేసిన కొందరిని నగరంలో నియమించారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. నగరంతో పాటు శ్రీకాకుళం రూరల్ మండలంలోని కొన్ని స్థానాలను బ్లాక్ చేయగా హెల్త్ సెక్రటరీలు గంటకు పైగా ఆందోళన చేయడంతో వాటిని ఖాళీగా చూపించారు. అయితే వాటిని అడిగిన వారికి కాకుండా అధికారులు అనుకున్నవారికే కేటాయించడం గమనార్హం. ఇందుకు ఉదాహరణకు ఆదివారపుపేట సచివాలయం చెప్పవచ్చు. ఈ స్థానాన్ని సీనియారిటీ జాబితాలో 100 లోపు క్రమ సంఖ్యలో ఉన్నవారు అడిగినప్పుడు ఖాళీ లేదని చెప్పిన అధికారులు క్రమ సంఖ్య 300 దాటిన తరువాత ఉన్న ఓ అభ్యర్థికి కేటాయించడమే నిదర్శనం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కొందరు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఇష్టారాజ్యంగా వార్డు హెల్త్ సెక్రటరీల ట్రాన్స్‌ఫర్లు
అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు ప్రక్రియ
నగరంలో ఉన్నవారికి స్థానికంగా పోస్టింగ్ ఇవ్వని వైనం
రాత్రిపూట ఆందోళనకు దిగిన ఉద్యోగులు