
స్థానికులకు ఇదేం శిక్షణ!
● టైలరింగ్ శిక్షణలో జిల్లా ట్రైనర్లకు చోటు కల్పించని వైనం
● విజయవాడకు చెందిన సంస్థలకే శిక్షణా అనుమతులు
● న్యాయం చేయాలని కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాల మహిళలకు అందిస్తున్న టైలరింగ్ శిక్షణ ప్రారంభం నుంచే విమర్శలకు గురవుతోంది. అభ్యర్థుల ఎంపిక, శిక్షణ తీరు, సంస్థల ఎంపికలో ఆదిలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అభ్యర్థులకు శిక్షణ అందించే సంస్థలు స్థానికులకు కాకుండా విజయవాడకు చెందిన మూడు సంస్థలకు కట్టబెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో నైపుణ్యవంతులైన ట్రైనర్లను కాదని ఎక్కడో విజయవాడకు చెందిన సంస్థల నిర్వాహకులతో ట్రైనింగ్ ఇప్పించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయమై కలెక్టర్ గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఇదీ పరిస్థితి..
బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ వర్గాలకు చెందిన 21 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలకు టైలరింగ్ శిక్షణ అందజేస్తున్నారు. రోజుకు రెండు షిఫ్టులో శిక్షణ అందిస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు బ్యాచ్‌లకు శిక్షణ అందజేస్తున్నారు. శిక్షణ ఫేస్ యాప్ ద్వారా హాజరు వేయిస్తున్నారు. ఇదంతా విజయవాడ సెంట్రల్ కార్యాలయం నుంచే ఆపరేటింగ్ జరుగుతుంది. అభ్యర్థులకు 75 శాతం హాజరును తప్పనిసరి చేశారు. వీరికి మాత్రమే శిక్షణ అనంతరం కుట్టుమిషన్, సామగ్రి అందజేశారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు..
సాధారణంగా జిల్లాలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను స్థానికంగా ఉండే సంస్థలకే ఇస్తుంటారు. దీనివల్ల సంస్థలకు ఆర్థిక ఆసరా కలగటంతో పాటు నాణ్యమైన శిక్షణ అందించే అవకాశం ఉంటుంది. అయితే తాజా టైలరింగ్ శిక్షణలో కేంద్రాల మంజూరు పూర్తిగా రాజకీయపక్షంగా జరగడంతో స్థానికులకు అవకాశం కల్పించలేదు. దీంతో పలువురు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాల నిర్వాహకులు ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకున్నారు. జిల్లాలో పది వరకు కుట్టు శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించాలని శ్రీకాకుళం నగరానికి చెందిన గాయిత్రీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేశారు.
అయోమయ శిక్షణ..
జిల్లాలో 29 శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో చేరేందుకు 2800 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరికి అంతంతమాత్రంగానే శిక్షణ అందుతోంది. శిక్షణ తూతూమంత్రంగా పూర్తిచేసి అక్రమాలకు పాల్పడేలా వ్యూహరచన జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిక్షణ కేంద్రంలో మిషన్లు నాసిరకమైనవి సరఫరా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుట్టుకు కావాల్సిన క్లాత్, ఇతర సామగ్రీ సరఫరా చేయడం లేదు. బయోమెట్రిక్ హాజరులోనూ అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆ మూడు సంస్థలకే..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ శిక్షణకు విజయవాడకు చెందిన శాప్, కార్డు, శ్రీ టెక్నాలజీ సంస్థలే అందిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా శిక్షణకు కావాల్సిన అర్హతలున్న సంస్థలకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం లేకుండాపోయింది. శిక్షణ ఇవ్వడం ద్వారా వచ్చే ప్రతిఫలం స్థానికులకు కాకుండా ఎక్కడో విజయవాడలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేలా ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక మహిళకు మూడు నెలల్లో 360 గంటలు పాటు శిక్షణ అందించాలి. శత శాతం శిక్షణలు తీసుకున్న అభ్యర్థికి శిక్షణ ఇచ్చేందుకు రూ.28000 చొప్పున ప్రభుత్వం శిక్షణ సంస్థకు జమచేస్తుంది.

స్థానికులకు ఇదేం శిక్షణ!