పిల్లల బియ్యం పక్కదారి..? | - | Sakshi
Sakshi News home page

పిల్లల బియ్యం పక్కదారి..?

Jul 3 2025 7:43 AM | Updated on Jul 3 2025 7:43 AM

పిల్లల బియ్యం పక్కదారి..?

పిల్లల బియ్యం పక్కదారి..?

● రెండో విడతలోనే నీరుగారిన లక్ష్యం ● పాఠశాలలకు నాసిరకం బియ్యం పంపిణీ ● తనిఖీల్లో వెలుగు చూసిన వైనం ● సన్నబియ్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు తదితర ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం ప్రారంభమైన ఒక్క నెలలోనే నీరుగారుతోంది. నాణ్యమైన సన్న బియ్యం స్థానంలో నాసిరకం పురుగులతో కూడిన బియ్యాన్ని సివిల్‌ సప్లయ్‌ అధికారులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కవిటి మండలంలో ఈ బియ్యంపై జరిగిన తనిఖీల్లో ఈ పురుగుల బియ్యం బాగోతం బయిటపడింది. ఈ బియ్యాన్ని జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ ద్వారా ఎంఎల్‌ఎస్‌ పాయింట్స్‌, అక్కడ నుంచి పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలు ఇలా ఆయా పాఠశాలలకు అందజేస్తారు. కేవలం పాఠశాలలకు సంబంధించి నెలకు 15,468 ప్యాకెట్లు (ఒక ప్యాకెట్‌ 25 కిలోలు వంతున) అందజేస్తున్నారు. ఇవి కాకుండా ఇతర సంస్థలు కేజీబీవీ, గురుకులాలు వంటి వాటికి కూడా ఇదేస్థాయిలో బియ్యం బ్యాగ్‌లు అందిస్తున్నారు. అయితే వీటిలో జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారుల అవినీతి వలన పురుగుల బియ్యంను అందజేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారులకు ఫిర్యాదులు

ఈ బియ్యం సరఫరా చేయడం జూన్‌ నెలలో ప్రారంభించారు. అయితే రెండో విడతలో పాఠశాలలకు సరఫరా అయిన బియ్యం చాలా వరకు నాసిరకంగా, పురుగులు ఉన్నాయని పాఠశాలల హెచ్‌ఎంలు విద్యాశాఖ, సివిల్‌ సప్లయ్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులు జిల్లాస్థాయిలో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారికి చేరినా చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల ప్రారంభంలో సన్నబియ్యం నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి సరఫరా జరిగాయి. తొలి విడతలో నాణ్యమైన బియ్యం వచ్చాయి. అందువలన దీనిలో మార్పులు జరగకుండా క్యూఆర్‌ కోడ్‌ టాగింగ్‌ విధానం ఏర్పాటు చేశారు. అయితే రెండో విడతలోనూ ఇతర జిల్లాల నుంచి నాణ్యమైన బియ్యమే వచ్చినా, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు లోకల్‌ బియ్యానికి క్యూ ఆర్‌ కోడ్‌ ట్యాగులు వేసి పాఠశాలలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీనివలన రెండో విడతలో వచ్చిన నాణ్యమైన సన్నబియ్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

క్వాలిటీ సిబ్బంది వైఫల్యం

పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలకు అందించే బియ్యాన్ని సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారులు తనిఖీలు చేయాలి. వాటి నాణ్యతను పరిశీలించి, అనుమతులు ఇవ్వాలి. అయితే ఈ విభాగం జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారి నియంత్రణలో ఉంటుంది. కానీ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి వ్యవస్థ ఈ కార్యాలయంలో నిర్వీర్యం చేయడంతో ఎటువంటి తనిఖీలు జరగడం లేదని ఈ బియ్యం సరఫరా ద్వారా తేటతెల్లమవుతోంది. వీరు కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేసే మిల్లర్లతో కుమ్మకై , అవినీతికి పాల్పడి నాసిరకం బియ్యానికి అనుమతులు ఇస్తున్నారని తెలుస్తోంది.

మధ్యాహ్న భోజన

బియ్యంలో పురుగులు

పురుగులు ఉన్నట్లు గుర్తింపు

విద్యార్థుల ఎండీఎం బియ్యంపై ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, పాఠశాలల్లో విరివిగా తనిఖీలు చేయాలని ఇటీవల జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తహసీల్దార్లు, ఇతర అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా కవిటి మండలంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 25 కిలోల నాణ్యమైన సన్నబియ్యం ప్యాకెట్లను తనిఖీ చేస్తుండగా, అందులో తెల్లచీమ, పురుగులు ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పురుగుల బియ్యం బాగోతం, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్వాహకం వెలుగు చూసింది.

కవిటి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యంలో పురుగులు ఉన్నట్లు తహసీల్దార్‌ బి.మురళీమోహనరావు గుర్తించారు. తొలుత ఈ విషయాన్ని విద్యార్థులు విలేకరులకు తెలియజేయగా.. వారు తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో వంట చేస్తున్న సమయంలో వెళ్లి తనిఖీలు చేశారు. పురుగులు ఉండడం వాస్తవమేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత జాయింట్‌ కలెక్టర్‌కు వాట్సాప్‌ ద్వారా సమాచారం చేరవేశారు. దీనిపై జేసీ స్పందిస్తూ సంబంధిత అధికారులు, బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పురుగుల బియ్యం మార్చి నాణ్యమైన స్టాక్‌ విడుదల చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement