
సంస్కారహీనుడు అచ్చెన్నాయుడు
టెక్కలి: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, వలసలు నివారించాలనే ఉద్దేశంతో మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన సంస్కారహీనుడు మంత్రి అచ్చెన్నాయుడని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలోని అయోధ్యపురం సమీపంలో ఉన్న పోర్టురోడ్డులో మీడియా సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కిడ్నీ ఆస్పత్రి, ఉద్దానానికి తాగునీరు అందించిన వ్యక్తిని, వెయ్యి అడుగుల గోతులో పాతేస్తానని బుర్ర తక్కువ వ్యాఖ్యలు చేస్తావా అని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడిని, అతని కుటుంబ సభ్యులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఈ జిల్లా ప్రజలు, నియోజకవర్గానికి చెందిన ప్రజల కోసం ఆ కుటుంబం ఒక్క అభివృద్ధి పనైనా చేసిందా అని ప్రశ్నించారు. దశాబ్ధాలుగా ఈ ప్రాంతంలో రాజకీయ పబ్బం గడుపుతున్న కింజరాపు కుటుంబం చేయలేని అభివృద్ధిని తమ నాయకుడు చేశారని గుర్తు చేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో 80 శాతం పనులు
గత వైఎస్సార్‌సీపీ హయాంలో సుమారు 80 శాతం పోర్టు పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటాలు కుదరకపోవడంతో కొన్ని నెలల పాటు పోర్టు పనులు నిలిపివేశారని తిలక్ దుయ్యబట్టారు. మరలా కింజరాపు కుటుంబం సొంత ప్రయోజనాలకు కమీషన్లు కుదరడంతో పోర్టు పరిశీలన పేరుతో పర్యటనలు చేయడం సిగ్గు చేటుగా లేదా అని నిలదీశారు. పోర్టు అప్రోచ్ రోడ్డులో రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. దొంగనోట్లు మాఫియాతో జత కడుతూ టెక్కలి నియోజకవర్గంలో రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి అచ్చెన్నాయుడని ఆరోపించారు. అచ్చెన్నాయుడు చేస్తున్న అరాచకాలకు వత్తాసు పలుకుతున్న కొంతమంది అధికారులు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే భవిష్యత్‌లో బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ హెచ్.వెంకటేశ్వర్రావు, వైస్ ఎంపీపీ పి.రమేష్, బన్నువాడ సర్పంచ్ పి.మోహన్‌రావు, నాయకులు సత్తారు సత్యం, ఎం.గణపతిరావు, టి.పాల్గుణరావు, జె.జయరాం, పి.రమణబాబు, కె.జీవన్, బి.రాజేష్, ఎం.రమేష్, పి.శ్యామలరావు, ఆర్.మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నోట్లు మాఫియాతో ఆయనకు
సంబంధాలు
మండిపడిన పేరాడ తిలక్