
శభాష్ అరుణకుమారి!
ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వ ఉద్యోగులైతే చాలు.. తమ పిల్లల కోసం లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని సర్కారు బడిలో చదివించడం గొప్ప విశేషమని డీఈఓ సదాశివుని తిరుమల చైతన్య అన్నారు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం ముచ్ఛింద్ర ప్రాథమిక పాఠశాల ప్రార్థనా సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వారి సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు బి. అరుణకుమారి తన ఇద్దరు పిల్లల్ని అదే పాఠశాలలో చదివిస్తున్నట్లు తెలుసుకున్న అభినందించారు. ఉపాధ్యాయులంతా తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివిస్తే సర్కారు బడులపై, బోధనపై విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి కురమాన అప్పారావు ఉన్నారు.
బీపీఈడీ, డీపీఈడీ పరీక్షలు ప్రారంభం
ఎచ్చెర్ల: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వర్శిటీలో వ్యాయామ విద్యా కోర్సులైన బీపీఈడీ, డీపీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈ నెల 4 వరకు జరగనున్నాయి. మొదటిరోజు పరీక్షకు 359 మంది విద్యార్థులకు గాను 11 మంది గైర్హాజరయ్యారు. వర్శిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ స్వప్నవాహిణి పర్యవేక్షిస్తుండగా పరీక్షా కేంద్రాలను రెక్టార్ బి.అడ్డయ్య పరిశీలించారు.
సాగుహక్కు పత్రాలు
పంపించడం తగదు
బూర్జ: అన్నంపేట గ్రామ పరిధిలో ఎన్నో ఏళ్లుగా దళితులు, బలహీనవర్గాలు సాగుచేస్తున్న భూములకు సంబంధించి మంగపల్లి సూర్యప్రకాశరావు అనే వ్యక్తి ఆ భూములపై తనకే హక్కు ఉందంటూ ఇప్పుడు సాగు హక్కు పత్రాలు పంపించడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం అన్నారు. మంగళవారం అన్నంపేటలో సాగుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ మూడులో 75 ఏళ్లుగా బలహీన వర్గాలకు చెందిన 30 కుటుంబాల వారు 25 ఎకరాల భూములను వరకట్టి బాగు చేసి సాగు చేస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారుల సహకారంతో ఇప్పుడు హక్కు పత్రాలు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాగులో ఉన్న వ్యక్తులకే భూముల చెందాలన్నారు. కార్యక్రమంలో దంత శ్రీరాములు, లుకలాపు అప్పలనాయుడు, ఎం.కిరణ్, సూరమ్మ, గౌరమ్మ, డి.లక్ష్మి, ఎస్.అప్పారావు, గణపతి, సూర్యనారాయణ, పి.రవి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
రణస్థలం: కోష్ఠ సమీపంలో రాధాకృష్ణ మందిరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం వి.ఎన్.పురం పంచాయతీ మిందిపేటకు చెందిన మింది ఆదినారాయణ శ్రీకాకుళం వైపు బైక్‌పై వస్తూ రాధాకృష్ణ మందిరం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న టాటా లగేజి వ్యాన్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు 20 నిమిషాల పాటు రక్తపు మడుగులోనే కొట్టుమిట్టాడు. అనంతరం 108 అంబులెన్సు రావడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శభాష్ అరుణకుమారి!

శభాష్ అరుణకుమారి!

శభాష్ అరుణకుమారి!