
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తిరుమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు (07009, 07010) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం (5 సర్వీసులు మాత్రమే) రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణుగుంట స్టేషన్ల మీదుగా వెళ్తాయన్నారు.
నాందేడ్–ధర్మవరం మధ్య..
నాందేడ్–ధర్మవరం మధ్య ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, ఆదివారం రైళ్లు నడుపుతున్నట్లు శ్రీధర్ తెలిపారు. నాందేడ్ జంక్షన్ (07189) నుంచి ఆగస్టు 1 (శుక్రవారం) రైలు బయలు దేరుతుందన్నారు. అలాగే, ఆగస్టు 3 (శనివారం) తిరుపతి జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. ధర్మబాద్, బాసర, నిజామబాద్, కామారెడ్డి, నెలగొండ, మిర్యాలగూడ, నడికుడి, రంపిచర్ల, వినుకొండ, కంభం, గిద్దలూరు, నంద్యాల, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, కదిరి సేష్టన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టీడీపీ నేతలకు
పతనం తప్పదు
మడకశిర: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు రాజకీయ పతనం తప్పదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మడకశిర నగర పంచాయతీ ఎన్నికలో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాతీర్పును అగౌరవపరచిన టీడీపీ నేతలను రానున్న ఎన్నికల్లో ప్రజలే ఓటుతో శిక్షించడం ఖాయమన్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకుని నగర పంచాయతీ దక్కించుకున్నామని సంబరపడుతున్న టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. ఏడాది కాలంలో టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడంపైనే నిమగ్నమై... మడకశిర అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టారని ఈరలక్కప్ప ఆరోపించారు.
మంచికి అండగా నిలిచిన
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..
టీడీపీ నేతల ప్రలోభాలకు లొంగకుండా మంచికి అండగా నిలిచిన కౌన్సిలర్లందరికీ ఈరలక్కప్ప ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది భయపెట్టినా వైఎస్సార్ సీపీకి అండగా నిలిచిన కౌన్సిలర్లు అందరినీ పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. నగర పంచాయతీని కోల్పోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరో 8 నెలల్లో మళ్లీ నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అప్పుడు ప్రజా మద్దతు సత్తా చాటుదామని ఆయన పిలుపునిచ్చారు.