
స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి
సాక్షి, పుట్టపర్తి
కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జడలు విప్పుకుంటోంది. ఇప్పటికే కర్ణాటకలో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు అధికారులు ముందస్తు నివారణ చర్యల గురించి ప్రస్తావించకపోవడంతో మనం భద్రమేనా..అన్న ప్రశ్న తలెత్తుతోంది.
సరిహద్దు నుంచి నిత్యం రాకపోకలు..
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది విద్య, ఉపాధి కోసం బెంగళూరు, చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, యలహంక వెళ్లి వస్తుంటారు. కార్లు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తారు. దీంతో మనిషి నుంచి మనిషికి సులువుగా సోకే కరోనా వైరస్ ఇక్కడి ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం లేకపోలేదు. గత 2020, 2021లో కరోనా వైరస్ చేసిన మరణ మృదంగం తలుచుకుంటే ప్రజలకు నిద్ర పట్టడం లేదు. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయం భయంగా గడుపుతున్నారు.
జిల్లా వాసుల్లో టెన్షన్..
కరోనా వంటి ప్రమాదకర వైరస్ సమీపంలోని బెంగళూరు వరకు వచ్చిందనే విషయం తెలియగానే.. జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, గోరంట్ల, పుట్టపర్తి ప్రాంతాల్లో టెన్షన్ మొదలైంది. పొరుగు రాష్ట్రంలో వైరస్ తొంగి చూడటంతో ఇక్కడి జనం ఉలిక్కిపడ్డారు. జిల్లా నుంచి రైళ్లు, బస్సులు, కార్లలో రోజూ వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా జిల్లా కేంద్రం పుట్టపర్తి నుంచి రోజూ సగటున వంద వరకు కార్లు విదేశీయులతో బెంగళూరు విమానాశ్రయం వెళ్తుంటాయి. ఈ క్రమంలో విమానాల్లో వచ్చిన వారి నుంచి వైరస్ సంక్రమిస్తుందన్న భయం అందరినీ వెంటాడుతోంది.
పెరిగిన డిమాండ్..
కొత్తగా వైరస్ కేసులు పక్కనే ఉన్న బెంగళూరులో తేలడంతో మాస్క్‌లు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. ఎవరికి వారుగా ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో పాటు జ్వరం, జలుబు లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్‌లు ధరించి బయటికి వస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో శానిటైజర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ముందు తరహాలో అనుమతించడం లేదు. రెండు మూడు రోజుల్లోనే పుట్టపర్తిలో మార్పు వచ్చింది. గతంలో కరోనా వైరస్ విజృంభించిన తీరు గురించి పదే పదే చర్చించడం మొదలుపెట్టారు.
ముందస్తు చర్యలు తీసుకోని ప్రభుత్వం..
కరోనా వంటి ప్రమాదకర వైరస్‌లు ప్రబలిన సమయంలో గతంలో వైఎస్సార్ సీపీ సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రజారోగ్యమే పరమావధిగా కఠినంగా వ్యవహరించింది. పాజిటివ్ కేసుల గుర్తింపు మొదలు క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స అవసరమైన వారికి ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయడం, కోవిడ్ కేర్ సెంటర్లు, ఆహారం సరఫరా, కూరగాయల పంపిణీతో పాటు అత్యవసర సమయాల్లోనూ వలంటీర్ల ద్వారా ప్రతి నెలా పింఛన్ అందజేయడం వంటి సహాయక చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలపై కూడా ఆంక్షలు విధించి జిల్లా వాసులను కాపాడింది. అయితే ప్రస్తుత కూటమి సర్కారు అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. కనీసం కరోనా టెస్టులు చేసేందుకు అవసరమైన కిట్లు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో చిన్న జ్వరం వచ్చిన వారు కూడా హడలిపోతున్నారు. పైగా ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీని కూడా రద్దు చేసింది. దీంతో ప్రజల్లో వైరస్‌ల భయం రెట్టింపయ్యింది. ప్రభుత్వం నుంచి భరోసా అనుమానమే అన్న భయం వెంటాడుతోంది.
పుట్టపర్తికి చెందిన శ్రీనివాసులు ఉపాధి నిమిత్తం రోజూ రైలులో సిలికాన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరుకు వెళ్లివచ్చేవాడు. అక్కడ కరోనా కేసులు నమోదుకావడంతో స్థానికంగానే పనులు చేసుకుంటున్నాడు. బెంగళూరుకు వెళ్తే కూలి ఎక్కువ వస్తుంది కదా అని ప్రశ్నిస్తే... ఆ డబ్బులొద్దు... ఆ జబ్బు వద్దంటున్నాడు.
హిందూపురానికి చెందిన ప్రకాష్ స్థానికంగా గిఫ్ట్ అండ్ నావల్టీస్ దుకాణం నడుపుతున్నాడు. ప్రతి చిన్న పనికీ సమీపంలో ఉన్న బెంగళూరుకు వెళ్లేవాడు. కానీ ఇప్పుడు ఈ ఊరి పేరు చెబితేనే భయపడిపోతున్నాడు. ఇటీవల అక్కడ కరోనా కేసులు బయటపడటంతో ఏదైనా కావాలంటే అనంతపురం వెళ్తున్నాడు.
..ఇలా వివిధ పనుల నిమిత్తం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగించే జిల్లా వాసులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కానీ బెంగళూరు నుంచి వచ్చేవారు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. దీంతో జిల్లా వాసులు హైరానా పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పొరుగు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా...మనం భయపడాల్సిన పనిలేదు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జనావాస ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలి. మాస్కు లేకుంటే ఆస్పత్రుల్లో ప్రవేశం నిషిద్ధం. గతంలో కరోనా వైరస్ సమయంలో పాటించిన జాగ్రత్తలను తిరిగి కొనసాగించండి. వైరస్ సోకక ముందే అప్రమత్తంగా ఉండటం మంచిది. అయితే వైరస్‌తో ఏమీ కాదనే నిర్లక్ష్యం వద్దు.
– డాక్టర్ ఫిరోజాబేగం, డీఎంహెచ్‌ఓ

స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి