
ప్రయాణికులపై ‘మహా’ దెబ్బ
మడకశిర: టీడీపీ మహానాడు దెబ్బ ఆర్టీసీ ప్రయాణికులపై పడింది. మంగళవారం కడపలో మహానాడు ప్రారంభం కాగా, గురువారం ముగింపు సభ జరగనుంది. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేయాలని టీడీపీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించారు. అయితే జనాన్ని తరలించేందుకు ప్రైవేటు వాహనాలైతే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని భావించిన ‘తెలుగు తమ్ముళ్లు’ ఆర్టీసీ బస్సులపై దృష్టి సారించారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి దాదాపు సగం బస్సులను మహానాడుకు సిద్ధం చేశారు. దీంతో గురు, శుక్రవారాల్లో జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
‘పల్లె వెలుగు’లే ఎక్కువ..
జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకున్న టీడీపీ నేతలు అందులోనూ ఖర్చు తక్కువగా ఉంటుందని ‘పల్లె వెలుగు’లకే మొగ్గు చూపారు. మొత్తంగా జిల్లాలోని ధర్మవరం, కదిరి, హిందూపురం, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి డిపోల పరిధిలోని 167 బస్సులను మహానాడు కోసం తీసుకున్నారు. ఇందులో ధర్మవరం డిపో నుంచి 30, హిందూపురం డిపో నుంచి 30, కదిరి డిపో నుంచి 50, మడకశిర డిపో నుంచి 17, పెనుకొండ డిపో నుంచి 15, పుట్టపర్తి డిపో నుంచి 25 బస్సుల చొప్పున ఆర్టీసీ అధికారులు కేటాయించారు. ఇందులో ఎక్స్‌ప్రెస్ బస్సులు 48 ఉండగా, పల్లె వెలుగు బస్సులు 119 ఉన్నాయి.
ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం..
ఆర్టీసీ అధికారులు బస్సులను అద్దెకు పంపినా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను పంపాల్సి ఉంటుంది. కానీ ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం చూపారు. టీడీపీ అధికారంలో ఉండటంతో అడిగేవారే లేరన్నట్లు వ్యవహరించారు. మడకశిర డిపోలో మొత్తం 30 బస్సులుండగా, ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏకంగా 17 బస్సులను మహానాడుకు కేటాయించారు. కేవలం మిగిలిన 13 బస్సులు మాత్రమే ప్రయాణికులకు సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన డిపోల పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మహానాడు ప్రభావంతో కొన్ని బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి. ఎక్కువగా పల్లె వెలుగు బస్సులను తీసుకోవడంతో రెండు రోజుల పాటు ప్రయాణికులు గమ్యస్థానాన్ని చేరడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు..
మహానాడుకు అత్యధికంగా ఆర్టీసీ బస్సులనే వాడుకోవడం కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వందలాది ప్రైవేట్ బస్సులు, వాహనాలున్నా...ఆర్టీసీ బస్సులను మహానాడుకు వినియోగించుకోవడం ప్రయాణికులను ఇబ్బందులు పెట్టడమేనని వాపోతున్నారు. అమరావతిలో ఇటీవల జరిగిన మోదీ సభకు కూడా ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రెండు రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ టీడీపీ నాయకులు మహానాడు పేరుతో ఆర్టీసీ బస్సులను తీసుకుని ప్రయాణికులను ఇబ్బందులు పెడుతుండటం సర్వత్రా ఆగ్రహానికి గురిచేస్తోంది.
మహానాడుకు జిల్లా నుంచి
167 ఆర్టీసీ బస్సులు
ఎక్కువగా ‘పల్లె వెలుగు’ బస్సులను
పంపిన వైనం
రెండు రోజులు ప్రయాణికులకు
తప్పని ఇబ్బందులు