
భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయండి
● అధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్‌హెచ్ –342, ఎన్‌హెచ్–716జీ రహదారులతో పాటు పలు జాతీయ రహదారులు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూకేటాయింపు ప్రతిపాదనలపై వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక రూపొందించి రెవెన్యూ డివిజనల్ అధికారులకు, కలెక్టరేట్‌లో అందజేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్–342 జాతీయ రహదారికి సంబంధించి బుచ్చయ్యగారిపల్లి గ్రామస్తులకు ఇవ్వాల్సిన పరిహారం, పుట్టపర్తి మండలం అమగొండపాళ్యం రెవెన్యూ గ్రామస్తులకు ఇవ్వాలని పరిహారం పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ పనులన్నీ వెంటనే పూర్తి చేసి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్ కుమార్, శర్మ, మహేష్, ఎన్‌హెచ్ ఏఐ పీడీ అశోక్ కుమార్, అధికారులు మల్లికార్జునరావు, బి.నాగరాజు, గిడ్డయ్య, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
సీటు రాదేమోనని..
విద్యార్థిని ఆత్మహత్య
పరిగి: పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మండలంలోని కొడిగెనహళ్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపిన వివరాలు మేరకు... కొడిగెనహళ్లి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న వెట్టి గోపాలప్ప కుమార్తె వెట్టి హేమావతి(15) 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆమెకు 379 మార్కులు వచ్చాయి. అయితే ఇంకా మంచి మార్కులు రావాల్సి ఉండేదని హేమావతి నిత్యం బాధపడేది. ఇంటర్‌లో చేరేందుకు మంచి కళాశాలలో సీటు వస్తుందో రాదోనని ఆందోళన చెందేది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెబుతూ తరచూ బాధపడేది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌లో మంచి కళాశాలలో సీటు రాదేమోనన్న భయంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హేమావతి తండ్రి గోపాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంగడు తెలిపారు.
‘తమ్ముళ్ల’ చిల్లర వేషాలు
● వైఎస్సార్ సీపీ నేతల పేర్లతో
టీడీపీ సభ్యత్వ కార్డులు
● వాటిని సామాజిక మాధ్యమాల్లో
వైరల్ చేస్తున్న వైనం
చిలమత్తూరు: తెలుగు తమ్ముళ్లు చిల్లర వేషాలు వేస్తున్నారు. తమ మాట వినని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. చివరకు వైఎస్సార్ సీపీ నేతల పేర్లతో టీడీపీ సభ్యత్వ కార్డులు తయారు చేయించి వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీకి చెందిన చిలమత్తూరు– 2 ఎంపీటీసీ సభ్యురాలు సనమ్‌హుస్నా భర్త షాకీర్‌తో పాటు ఆయన తల్లి పేరుతో కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు పంపించారు. వాటిని టీడీపీ నేతలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన షాకీర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను ఎప్పుడూ టీడీపీ సభ్యత్వం కోసం దరఖాస్తు చేయలేదని, పార్టీ మారాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. టీడీపీ నేతలు చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. తన రాజకీయ ప్రయాణం వైస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ నేతల విష ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు.

భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయండి