
పుట్టపర్తిలో దాహం కేకలు
పుట్టపర్తి టౌన్: అధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన పుట్టపర్తిలో దాహం కేకలు మిన్నంటాయి. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైనా..చాలా వార్డుల్లో తాగునీటికి జనం అల్లాడిపోతున్నారు. తాజాగా మంగళవారం 5 వార్డు కుమ్మరిపేట మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. నాలుగురోజులుగా తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నా ఎవరికీ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే పల్లె సింధూరారెడ్డికి వ్యతిరేకంగా ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ...నాలుగు రోజులుగా బోరు మోటర్ మరమ్మతుకు గురైందని, దీంతో తమకు తాగునీటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. నాలుగురోజులుగా అధికారులకు, ఎమ్మెల్యే కార్యాలయానికి సమస్య చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా గతంలోనూ తమకు ఇష్టమొచ్చినప్పుడు నీరు వదిలేవారని, దీంతో కూలి చేసుకునే తాము పనులు మానుకుని నీటికోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని, లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళల ఆందోళన గురించి స్థానిక కౌన్సిలర్ సూర్యాగౌడ్ మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా... ఆయన స్పందించి త్వరగా మోటర్ మరమ్మతు చేయించి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
ఎమ్మెల్యే సింధూరారెడ్డి
డౌన్ డౌన్ అంటూ నినాదాలు