
వైఎస్సార్ స్మారక స్థూపం తొలగింపు
చిలమత్తూరు: హిందూపురం మున్సిపల్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, పట్టణంలోని రెహమత్‌పురం సర్కిల్లో ఉన్న ప్రజానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక స్థూపాన్ని శనివారం రాత్రి తొలగించారు. సెంట్రల్ లైటింగ్ పేరుతో ఈ చర్యకు ఒడిగట్టారు. అయితే వైఎస్సార్‌సీపీ శ్రేణుల తీవ్ర నిరసనల నేపథ్యంలో ప్రజానేత స్మారక స్థూపాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. స్మారక స్థూపం తొలగింపు విషయం తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆదివారం ఉదయం పార్టీ నియోజకవర్గ నేత వేణురెడ్డి ఆధ్వర్యంలో రెహమత్‌పురం సర్కిల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పార్టీ నేతలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రి స్మారక స్థూపాన్ని ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే బాలకృష్ణకు, మున్సిపల్ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నేతలంతా ప్రతిఘటించారు. దీనితో చేసేదిలేక మునిసిపల్ అధికారులను పిలిపించి మాట్లాడించారు. చివరకు స్థూపాన్ని యథాస్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. దీనితో పార్టీ శ్రేణులు ఆందోళన విరమించాయి. కార్యక్రమంలో పార్టీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అసిఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబీఉల్లా తదితర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. టీడీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వేణురెడ్డి ఈ సందర్భంగా మండిపడ్డారు. దివంగత నేత హిందూపురానికి శ్రీరామరెడ్డి పథకం ద్వారా తాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసుకున్న స్థూపాన్ని ఎలా తొలగిస్తారని మండిపడ్డారు.
హిందూపురంలో
అధికారుల అత్యుత్సాహం
వైఎస్సార్‌సీపీ శ్రేణుల తీవ్ర నిరసన

వైఎస్సార్ స్మారక స్థూపం తొలగింపు

వైఎస్సార్ స్మారక స్థూపం తొలగింపు