
అకాల వర్షం.. అపార నష్టం
● జిల్లోలోని 27 మండలాల్లో వర్షం
● ఈదురుగాలులతో నేలరాలిన మామిడి కాయలు
పుట్టపర్తి/పుట్టపర్తి అర్బన్: అకాల వర్షంతో జిల్లా రైతులకు అపార నష్టం జరిగింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ జిల్లాలోని 27 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలీవాన బీభత్సంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా మామిడితోటల్లోని కాయలన్నీ నేలరాలాయి. బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో అధికంగా నష్టం వాటిల్లింది. బుక్కపట్నం మండలంలోని బుచ్చయ్యగారిపల్లి, జానకంపల్లి, కడపనాగేపల్లి తదితర గ్రామాల్లోని మామిడితోటల్లోని కాయలు రాలి కింద పడ్డాయి. దీంతో రైతులకు రూ.లక్షల నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో బీమాతో సంబంధం లేకుండా పంటనష్టం జరిగిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేలు నపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గాలీవానకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలవాలడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి.
సోమందేపల్లి మండలంలో అత్యధికం
సోమందేపల్లి మండలంలో అత్యధికంగా 37.2 మి.మీ వర్షం కురిసింది. ఇక పెనుకొండ 35.8, బత్తలపల్లి 35.6, గుడిబండ 32.4, బుక్కపట్నం 25.6, అమరాపురం 25.2, తాడిమర్రి 19.2, రొళ్ల 18.4, ధర్మవరం 15.6, కొత్తచెరువు 15.2, కనగానపల్లి 10.2, పుట్టపర్తి 10.2, అగళి 9, చిలమత్తూరు 8.8, తలుపుల 8.4, సీకేపల్లి 8.4, ఓడీచెరువు 7.4, హిందూపురం 6.8, మడకశిర 6.2, గోరంట్ల 6.2, రామగిరి 5.2, నల్లమాడ 4.6, రొద్దం 3.6, కదిరి 3.2, ముదిగుబ్బ, అమడగూరు, లేపాక్షి మండలాల్లో 2.2 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
కూలిన ఇల్లు.. దంపతులకు గాయాలు
పుట్టపర్తి టౌన్: అకాల వర్షానికి పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బడేనాయక్ తండాలోని ఓ ఇంటి పైకప్పు రేకులు ఎరిగిపోయాయి. గోడలు కూలిపోగా ఇంట్లో నిద్రస్తున్న డుంగావత్ ప్రసాద్‌నాయక్, నిర్మలాభాయికి గాయాలయ్యాయి. గాలి ధాటికి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరిపోయి సమీపంలోని పొలంలో ఉన్న ఆవులకు తగలడంతో అవి గాయపడ్డాయి.

అకాల వర్షం.. అపార నష్టం