జనవరిలో కొడవలూరు మండలంలో ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపైనున్న 30 గ్రాముల బంగారు సరుడు దోచుకెళ్లారు.
ఫిబ్రవరిలో చిల్లకూరు మండలంలో బంగారు ఉంగరం కోసం వృద్ధుడిని హత్య చేసిన యువకుడు.
మనుబోలు పరిధిలోని పిడూరు అండర్ బ్రిడ్జి వద్ద దంపతులపై దాడి చేసి 4 సవర్ల బంగారు సరుడు, కమ్మలను దుండగులు లాక్కెళ్లారు.
వెంకటాచలం మండలంలోని చెముడుగుంటలో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు 30 సవర్ల బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులు, రూ.40 వేల నగదును అపహరించారు.
తాజాగా నెల్లూరు వనంతోపులోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లో 30 సవర్ల బంగారు, రెండు కేజీల వెండి వస్తువులను గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు.
జిల్లాలో శాంతిభద్రతలు భ్రమగా మారాయి. పోలీస్ వ్యవస్థ రెడ్‌బుక్ రాజ్యాంగం మత్తులో తూగుతూ ఉండడంతో నేరస్తులు పంజా విసురుతూనే ఉన్నారు. వేకువ జామున ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వందల మంది పోలీసుల బూట్ల చప్పుళ్లతో హడావుడి చేసి కార్డెన్ సెర్చ్‌లంటూ ఇల్లిల్లూ జల్లెడ పడుతున్నా.. నాకాబందీ అంటూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నా.. నేరాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా వ్యవహరించిన పోలీస్ వ్యవస్థ నిఘాను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజలు రాత్రి వేళే కాదు.. పగటి పూట కూడా ప్రశాంతంగా, భద్రతగా బతకలేని పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. పట్టపగలు వరుస చైన్ స్నాచింగ్‌లే కాకుండా.. ఏకంగా భారీ చోరీలు, దోపిడీలకు తెగబడుతున్నారు. రాత్రయితే మద్యం మత్తులో రౌడీమూకలు రోడ్లపై చెలరేగుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన చోరీలు, దోపిడీలే ఇందుకు అద్దం పడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా దొంగలు బరితెగిస్తున్నారు. పట్టపగలే ప్రజల సొమ్మును ఇట్టే కొల్లగొడుతూ పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో దుండగులు సుమారు రూ.3 కోట్లకు పైగా సొత్తును దోచుకెళ్లారు. వరుస దొంగతనాలు జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. పాతనేరస్తుల కదలికలపై నిఘాతోపాటు జైల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. అయినప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. నేరస్తులు యథేచ్ఛగా నేరాలకు పాల్పడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని పంజా విసురుతున్నారు. రాత్రులే కాదు పట్టపగలే నిర్భయంగా ప్రజలు కూడబెట్టుకున్న ఽసొత్తును దోచుకెళుతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇళ్లలోనే కాకుండా అపార్ట్‌మెంట్‌ల్లోనూ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. దొంగతనాలకు కాదేది అనర్హమంటూ చోరులు దేవాలయాలను వదలడం లేదు. కొంతకాలంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఓ కేసులో నిమగ్నమై ఉండగానే నేరస్తులు మరో చోట నేరాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకు చాలెంజ్ విసురుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు.
పసిడి ధరలు పెరగడమే..
రోజు రోజుకు బంగారం ధరలు రాకెట్‌లా దూసుకెళుతుండటంతో దొంగల కన్ను పసిడిపై పడింది. దీంతో దొంగతనాలు అధికమయ్యాయి. పోలీసు గస్తీ అంతంత మాత్రంగా ఉండడం, అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం చోరులకు కలిసి వస్తోంది. దొంగలు చిన్నపాటి ఆధారం దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాలకు మాస్క్‌లు, తలకు హెల్మెట్‌లు ధరించి నంబర్ ప్లేట్లు లేని, దొంగిలించిన బైక్‌లపై సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలను, డీవీఆర్‌లను అపహరించుకుని వెళుతున్నారు. రాత్రి వేళల్లో బైక్‌పై వెళుతున్న దంపతులను కత్తులతో బెదిరించి నగలు, నగదు దోచేస్తున్నారు. పసిడి కోసం హత్యలకు, హత్యాయత్నాలకు వెనుకాడడం లేదు. తాజాగా నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో పట్టపగలు దుండగలు దాదాపు 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండిని దోచుకెళ్లడం జిల్లాలో సంచనలనంగా మారింది. సెక్యూరిటీతోపాటు సీసీకెమెరాల నీడలో ఉండే అపార్ట్‌మెంట్‌లోనే దొంగలు దర్జాగా స్కూటీపై దోచుకెళ్లారంటే చోరుల బరితెగింపునకు, ఖాకీ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
గొలుసు దొంగతనాలు
జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకునేవి. ఇప్పుడు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ గొలుసులను తెంపుకెళుతున్నారు. రోడ్లపై ఒంటరిగా వెళ్లే, ఇళ్ల ముందు శుభ్రం చేసుకునే, దుకాణాల్లో ఒంటరిగా ఉంటున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళుతున్నారు. మహిళలపై దాడిచేసి మరీ దోచుకెళుతున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దుండగులు తెంపుకెళ్లారు. గూడూ రుకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఆటలో పాఠశాలకు వెళుతుండగా ఆటో డ్రైవర్ ఆమైపె దాడి చేసి మెడలోని ఒకటిన్నర సవర బంగారు గొలుసును దోచుకున్నాడు
నిఘా ఏదీ..?
నిఘా, సాంకేతికత చోరీలను కట్టడి చేయలేకపోతున్నాయి. పగలు, రాత్రి గస్తీ అంతంత మాత్రంగానే మారింది. అనేక చోట్ల క్రైమ్ పార్టీలు మొక్కుబడి విధులకే పరిమితమైయ్యాయన్న విమర్శలున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి సీసీ కెమెరాలు సక్రమంగా లేవు. ఉన్న ప్రాంతాల్లోనూ కొన్ని పనిచేయకపోవడం చోరులకు కలిసి వస్తోంది. పోలీసు అధికారులు స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు సీసీకెమెరాల నిఘా నీడలోకి జిల్లాను తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ఘటనలు మచ్చుకు కొన్ని..
రెండేళ్లుగా జిల్లాలో
శాంతిభద్రతలు క్షీణత
రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థ
నిత్యం కార్డెన్ సెర్చ్, నాకాబందీ అంటూ హడావుడి
అయినా విచ్చలవిడిగా దొంగతనాలు, దోపిడీలు
ఒక బ్యాచ్ పట్టపగలు 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండి చోరీ
దర్జాగా స్కూటీలో వచ్చారు.. పని కానిచ్చేశారు
ఓ కారు తనిఖీల్లో రౌడీషీటర్ల వద్ద మారణాయుధాలు పట్టుబడిన వైనం
ఫలితమివ్వని పోలీస్ చర్యలు
బంగారం, వెండి అపహరణ
నెల్లూరు (క్రైమ్): సీసీ కెమెరాల నీడలో ఉండే ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో గుర్తు తెలియని దుండగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు... వనంతోపు మూడో వీధిలోని కల్పతరువు అపార్ట్‌మెంట్ రెండో ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో యామిని నివాసం ఉంటున్నారు. ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఉంటోంది. కుమార్తె తన బంగారు ఆభరణాలను తల్లి వద్దే ఉంచి వెళ్లారు. ఇటీవల యామిని ప్లాట్‌కు తాళం వేసి కుమార్తె వద్దకు వెళ్లింది. సోమవారం ఇద్దరు దుండగులు స్కూటీపై అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. ప్లాట్ తలుపును పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను తెరచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ఫ్లాట్ తలుపులు తెరచి ఉండడాన్ని వాచ్‌మెన్ గమనించి అపార్ట్‌మెంట్ వాసులకు తెలియజేశారు. వారు ఈ విషయాన్ని బాధితురాలికి చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరడంతోపాటు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఇంట్లో 35 సవర్లకు బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 20 సవర్లకు పైగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితులు వస్తే ఎంత మేరకు సొత్తు అపహరణకు గురైందో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
పక్కా రెక్కీవేసి..
సోమవారం ఉదయం 10.49 గంటల ప్రాంతంలో దుండగులిద్దరూ హెల్మెట్‌లు ధరించి స్కూటీపై అపార్ట్‌మెంట్ లిఫ్ట్ వద్దకు వచ్చారు. అందులో వెనుక కూర్చొన్న వ్యక్తి స్కూటీ దిగి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సెల్లార్‌లో స్కూటీపై వేచి ఉన్నాడు. పైకి వెళ్లిన వ్యక్తి రెండు నిమిషాల తర్వాత కిందకు వచ్చాడు. అనంతరం ఇద్దరు కలిసి పైకి వెళ్లి చోరీ చేసి స్కూటీపై వెళ్లిపోయారు. చోరీ జరిగిన తీరు, నిందితుల వ్యవహార శైలిని బట్టి పక్కా రెక్కీ వేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు ఢిల్లీకి చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన నిందితుడు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.


