ఉదయగిరి: అగ్రిగోల్డ్ సంస్థ.. ఆకర్షణీమైన వడ్డీని ఆశ చూపింది. కోట్లాది రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసింది. ఆ తర్వాత బోర్డు తిప్పేసి డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టింది. లక్షలాది మంది డిపాజిటర్లకు తీరని శోకాన్ని మిగిల్చింది. గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలే కుటల్రు చేసి అగ్రిగోల్డ్ సంస్థను మింగేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు బాధితులకు న్యాయం చేయకపోగా అగ్రిగోల్డ్ సంస్థ ప్రతినిధుల ద్వారా ఆస్తులను కాజేసే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరగలేదు.
రూ.కోట్ల విలువైన సంపద స్వాహా
జిల్లాలో అగ్రిగోల్డ్‌కు చెందిన భూములు, అందులోని సంపదను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాహా చేసే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలోని ఉదయగిరి, కలిగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, గూడూరు, మనుబోలు తదితర మండలాల్లో 3,200 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో విలువైన జామాయిల్, మామిడి, ఎర్రచందనం చెట్లు సాగులో ఉన్నాయి. వాటిపై కూటమి నేతలు కన్నేసి సంపదను కొల్లగొట్టారు. వరికుంటపాడులోని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్‌ను అక్రమంగా తరలిస్తుండగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు అడ్డుకున్నారు. వారిపైన అక్రమార్కులు దాడులకు సైతం పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అగ్రిగోల్డ్ భూముల్లోని రూ.కోట్ల విలువ చేసే సంపదను స్వాహా చేశారు.
న్యాయం జరిగేనా..?
గత వైఎస్సార్‌పీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని సంకల్పించింది. రూ.కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని భావించింది. కానీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. ఆస్తులను వేలం వేసి వచ్చిన సొమ్మును బాధితులకు ఇవ్వాలని సంకల్పించింది. ఈ వ్యవహారంలో విలువైన భూములు, ఆస్తులను కాజేసే ప్రయత్నాలు జరగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని కోసం కూటమి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. మరి బాధితులకు ఎప్పుడు న్యాయం చేస్తుందో తెలియని పరిస్థితి. పదేళ్లుగా బాధితులు మాత్రం న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
పాదయాత్రలో జగన్ దృష్టికి..
జిల్లాలో 1.20 లక్షల మంది బాధితులు
అందాల్సిన సొమ్ము రూ.150 కోట్లు
న్యాయం కోసం పదేళ్లకుపైగా
పోరాటం
జగన్ ప్రభుత్వంలో ఊరట
బాధితుల గోడును పట్టించుకోని కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన కొంత మేర నిలబెట్టుకున్నారు. జిల్లాలో 1.20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు గతంలో ప్రజాప్రతిధులు, ఆధికారుల చుట్టూ న్యాయం కోసం తిరిగి అలసిపోయారు. గత చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019లో అధికారం చేపట్టిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు న్యాయం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో రూ.10వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.50 కోట్లు చెల్లించారు. కానీ జిల్లాలో ఇంకా రూ.150 కోట్లకు పైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారడంతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయలేకపోయింది. ఇంతలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం రావడంతో అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి తలకిందులైంది.


