కొడవలూరు: యూరియా పంపిణీ విషయంలో టీడీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒక నాయకుడి ఇంటి వద్ద యూరియా బస్తాలు ఉంచి పంపిణీ చేయాలని యత్నించగా, మరో నాయకుడు వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య గొడవ నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన మండలంలోని పెమ్మారెడ్డిపాళెంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సూర్య అనే టీడీపీ వర్గీయుడు సచివాలయంలోని వ్యవసాయ సిబ్బందిని అడిగితే స్పందించకపోవడంతో ఆవేదన చెందిన ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పోవడంతో గ్రామానికి ప్రత్యేకంగా సోమవారం యూరియా లోడు పంపారు. అయితే ఆ యూరియాను టీడీపీ నాయకుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద పంపిణీ చేస్తుండగా సూర్య తండ్రి ప్రేమ్‌కుమార్ కోపోద్రిక్తుడయ్యారు. తన కుమారుడు యూరియా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి గ్రామానికి యూరియా వచ్చేలా చేస్తే ఆ నాయకుడు పెత్తనం చేస్తూ ఇంటి వద్ద నుంచి పంపిణీ చేయడమేమిటంటూ గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల వారు దుర్భాషలాడుకున్నారు. దీంతో గ్రామంలో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకొన్న ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు రంగంలోకి దిగి ఇరువర్గాలతో మాట్లాడి గొడవ తీవ్రరూపం దాల్చకుండా సర్దుబాటు చేశారు. ఇప్పటికే యూరియాను యాప్ ద్వారా పంపిణీ చేస్తుంటే.. మరో వైపు భారీ మొత్తంలో యూరియాను టీడీపీ నేతల ఇళ్లకు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


