నెల్లూరు(క్రైమ్): పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆదివారం పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. వాహనాల ఫిట్‌నెస్, బ్రేకుల పనితీరు, టైర్ల పరిస్థితి, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలు, జీపీఎస్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడరాదన్నారు. రోజూ వాహనాల పరిస్థితిని, డ్రైవర్లు విధులకు హాజరయ్యే ముందు వారి ఆరోగ్య, మానసిక స్థితి, మద్యం లేదా ఇతర పదార్థాల వినియోగం వంటి అంశాలను పరిశీలించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రవాణా చేసే వాహనాల పరిస్థితి, డ్రైవర్ల ప్రవర్తనను చూస్తుండాలని ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు, పోలీసులకు తెలియజేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై, నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


